భూ భారతి మంత్రులకు వజ్రాల హారతిలా మారిందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. భూ భారతి అవకతవకలపై ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్లు ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వచ్చే నెల 5, 6 తేదీల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, భూములను నిషేధిత జాబితాలో చేర్చబడిన బాధితులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
అప్పటికీ ప్రభుత్వం స్పందించి భూ భారతి 22ఏ, సమస్యపై చర్యలు తీసుకోకపోతే బీజేపీ పక్షాన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. కుట్రలు జరగట్లేదని ముఖ్యమంత్రి బుకాయిస్తున్నారని, కానీ ఈ కుట్రదారులు ఎవరో ప్రభుత్వం బహిర్గతం చేయాలని నిలదీశారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన బినామీ, షెల్ కంపెనీలకు సుమారు 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా బదిలీ అయ్యాయని, క్యాబినెట్ మంత్రిగా ఉంటూ సొంత కంపెనీలకు లబ్ది చేకూర్చుకోవడం దారుణమని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం నుంచి ప్రతి నెలా 200 కోట్ల రూపాయలు ఢిల్లీలోని రాహుల్ గాంధీకి ముడుపులుగా వెళ్తున్నాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ భారీ అవినీతి వ్యవహారంపై రాహుల్ గాంధీకి ఇంగ్లీష్, తెలుగు భాషలలో బహిరంగ లేఖను విడుదల చేసినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కేవలం చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరగడం కాకుండా, రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలపై రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 2014కు ముందు, ఆ తర్వాత ఉన్న 22ఏ భూముల జాబితాపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, అక్రమ ఆస్తుల బదిలీ, షెల్ కంపెనీల లావాదేవీలపై సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ (ఫోరెన్సిక్ ఆడిట్) జరిపించాలని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ పక్షాన ఆయన పట్టుబట్టారు.
ఎలాంటి కారణం లేకుండా కొన్ని భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి, మరి కొన్ని కొత్త భూములను అందులో చేర్చడం ద్వారా పాలకులే స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కుట్రలు జరగవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆయన విమర్శించారు. కుట్రదారులు ఎవరో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఏలేటి డిమాండ్ చేశారు.

More Stories
తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు.. బిజెపి 7 డిమాండ్లు
22ఏ నిషేధిత భూముల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ
ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్.అవార్డు – 2026