హైదరాబాద్‌లో మెడిసిన్ చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం చేస్తూ, వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న 11 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఆ నకిలీ డాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితుల్లో కొందరు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ యూనివర్సిటీల పేర్లతో రూపొందించిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను ఉపయోగించి క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మరికొందరు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేర్లను ఉపయోగిస్తూ రోగులకు వైద్యం అందిస్తున్నారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వైద్య విద్యకు సంబంధించిన సరైన అర్హతలు లేకపోయినా అల్లోపతి వైద్యం చేస్తూ రోగులకు మందులు, ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ వంటి మందులు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఎక్కడెక్కడ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు? నకిలీ సర్టిఫికెట్లను ఎక్కడి నుంచి పొందారు? ఎంతకాలంగా ఇలా నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తున్నారు? ఎంతమంది రోగులకు చికిత్స అందించారు? అనే అంశాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? నకిలీ విద్యా సర్టిఫికెట్లను తయారు చేసి సరఫరా చేస్తున్న ముఠా ఏదైనా ఉందా? అనే కోణంలోనూ విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది.
భారీగా నకిలీ వైద్యుల బాగోతం బయటికి రావడంతో నగర ప్రజలకు పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. అర్హతలు లేని వ్యక్తుల వద్ద చికిత్స తీసుకోవడం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అధికారులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే వారి వద్ద చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గతంలోనూ హైదరాబాద్‌లోని బౌరంపేట్, దుండిగల్, సూరారం వంటి ప్రాంతాల్లో సరైన వైద్య అర్హతలు లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. కొందరు రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులను అనుమతి లేకుండానే అందిస్తున్నట్లు అప్పట్లో గుర్తించడం సంచలనం రేపింది.

More Stories
కొండా సురేఖ, చిన్నారెడ్డిలను పదవుల నుండి తప్పించండి
న్యూయార్క్ లో `భారత్ వ్యతిరేకి’ని రేవంత్ కలిసే ప్రయత్నం ఎందుకు?
ఫీజు బకాయిలకై దీక్ష విరమించిన రామచందర్ రావు