అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోందని పేర్కొంటూ పెట్టుబడిదారులకు ఒక ‘ఆయస్కాంతం’లా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్‌ల సీఈఓలు, వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ ఆదివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలు, సాంకేతికత వినియోగంపై చర్చలు జరిపారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోను మోదీ తమ ఎక్స్ పోస్టులో పంచుకున్నారు. ఎప్పటిలాగే, భారత్ అంతరిక్ష ప్రయాణంపై స్టార్టప్‌ల అభిప్రాయాలు, ఆశావహ దృక్పథం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జెన్-జీ యువత సరికొత్త టెక్నాలజీని నిర్మిస్తోందని ప్రశంసించారు. అంతరిక్ష రంగంలోకి ప్రవేశించి ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారని స్పేస్స్టార్టప్ సీఈఓలను కొనియాడుతూ స్పేస్ టెక్నాలజీతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని వారికి సూచించారు. “అయోధ్యలో నేను చెప్పినట్లుగా ఇది ఒక కొత్త మార్పునకు నాంది. ఈ కొత్త శకంలో, ప్రపంచ క్రమంలో భారత్ తన అంతరిక్ష ఉనికిని స్థిరంగా విస్తరిస్తోంది. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న మన సంకల్పంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుంది” అని మోదీ పేర్కొన్నారు.
దేశ యువతను కొనియాడుతూ ఈ రోజు మన జెన్-జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ నుంచి శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌ల వరకు మన యువత గతంలో ఊహించని రంగాలలో పనిచేస్తోంది” అని పేర్కొన్నారు. ఇస్రో విజయాలు ఎంతోమంది పిల్లలకు శాస్త్రవేత్తలు కావాలనే స్ఫూర్తిని ఇస్తున్నాయని చెప్పారు.
2023లో ఇదే రోజున చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది “వికసిత భారత్ దిశగా : ఆవిష్కరణ, సహకారం, ప్రపంచ అంతరిక్ష నాయకత్వం” అనే థీమ్‌తో వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఎంతో ముఖ్యమని, దీనివల్ల రిస్క్ తీసుకునే వ్యాపారవేత్తలకు పూర్తి భరోసా లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
తమ తప్పిదాల వల్ల ఏదైనా సమస్య వస్తే అది వేరే విషయమని, కానీ ప్రభుత్వ విధానాల మార్పులతో మధ్యలో వదిలివేయరనే నమ్మకం ఉండాలని తెలిపారు. రిస్క్ తీసుకునే వారికి భరోసా కల్పించే వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ దేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు ఎంతో అవసరమని పిలుపునిచ్చారు.

More Stories
పార్టీ బలోపేతంకై కొత్త ఆలోచనలు, దృక్పధాలు.. మోదీ
డార్జిలింగ్ సమస్యకు “శాశ్వత రాజకీయ పరిష్కారం”కై కమిటీ
అత్యాచార కేసు కప్పిపుచ్చేందుకు రూ 5 కోట్లు అడిగిన సీఎం భార్య!