అత్యాచార కేసు కప్పిపుచ్చేందుకు రూ 5 కోట్లు అడిగిన సీఎం భార్య!

అత్యాచార కేసు కప్పిపుచ్చేందుకు రూ 5 కోట్లు అడిగిన సీఎం భార్య!
అత్యాచార కేసును కప్పిపుచ్చేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్ప్రీత్ కౌర్ మాన్ రూ. 5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) పరిగణనలోకి తీసుకుంది. కమిషన్‌కు అందిన ఫిర్యాదు ప్రకారం, ఈ ఆరోపణలకు సంబంధించిన పిటిషన్‌ను పంజాబ్ మాజీ న్యాయమూర్తి రంజిత్ సింగ్ దాఖలు చేశారు. 
 
ఇదే సమయంలో, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భార్య డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ మాన్, జస్టిస్ రంజిత్ సింగ్ (రిటైర్డ్)కు చట్టపరమైన నోటీసు జారీ చేశారు. ఈ రిటైర్డ్ న్యాయమూర్తి కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరాకు బావమరిది అవుతారు. ఈ నోటీసులో రంజిత్ సింగ్‌ను 24 గంటల్లోగా స్పందించాలని కోరారు, లేనిపక్షంలో ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది” అని తెలిపారు. 
 
కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ధర్మాసనం, పంజాబ్ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను విచారణ జరిపి, రెండు వారాల్లోగా తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కమిషన్ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖలోని మహిళా భద్రతా విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లింది. తీసుకున్న చర్యల నివేదిక ఆధారంగా కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుంది. 
 
తన ఆదేశాల్లో కమిషన్ ఇలా పేర్కొంది: “పంజాబ్ ముఖ్యమంత్రి భార్య ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపిస్తున్న ఒక అత్యాచార కేసు విషయంలో రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని ఒక రిటైర్డ్ న్యాయమూర్తి బహిరంగంగా చెప్పారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ‘లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ’ (ఎల్ఆర్ఓ) దాఖలు చేసిన ఈ ఫిర్యాదు, ఇటువంటి జోక్యం బాధితురాలి గౌరవం, భద్రత, నిష్పక్షపాత విచారణ, న్యాయం పొందే హక్కులకు భంగం కలిగించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆరోపణల స్వతంత్ర ధృవీకరణ, సాక్ష్యాల పరిరక్షణ, విచారణను నీరుగార్చడానికి లేదా ప్రభావితం చేయడానికి జరిగిన ఏ ప్రయత్నం పైనైనా నిష్పక్షపాత విచారణ జరపాలని ఇది కోరుతోంది.” 
 
అత్యాచార బాధితురాలికి న్యాయం పొందే హక్కు అనేది ఏ రకమైన ప్రభావం, హోదా లేదా పదవికి అతీతంగా ఉండాలన్న ఫిర్యాదుదారు అభిప్రాయాన్ని కమిషన్ గుర్తించింది. “ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు ప్రాథమికంగా బాధితురాలి మానవ హక్కుల ఉల్లంఘనగా కనిపిస్తున్నాయి”.  మరోవైపు తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని సంబంధిత మాజీ జడ్జికి గురుప్రీత్‌ కౌర్‌ శనివారం లీగల్‌ నోటీసు పంపించారు. కాగా,  ఆరోపణల తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రే స్వయంగా వివరణ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ డిమాండు చేశారు.