దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ

దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ

యువత ఆలోచనా విధానం, వారి ఆశధయాలు, సృజనాత్మక సామర్థ్యం, భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనలు, దేశ నిర్మాణంలో వారి పాత్రపై  విశాఖపట్నం సమీపంలోని గుడిలోవ విజ్ఞాన విహార్ ఆవాసీయ విద్యాలయ ప్రాంగణంలో మూడు రోజులపాటు జరిగిన  రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్
 (ఆర్ఎస్ఎస్) సమన్వయ బైఠక్ లో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో సమాజం, దేశం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంఘ్ ప్రేరిత సంస్థల ప్రముఖ బాధ్యులు, కార్యకర్తలు ఈ బైఠక్‌లో పాల్గొన్నారు. 
 
బైఠక్‌లో 49 మంది మహిళా ప్రతినిధులతో పాటు మొత్తం 306 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సర్‌సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్, సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబళే మార్గదర్శనం చేయగా పాటు సంఘ్ ప్రేరిత వివిధ సంస్థలకు చెందిన జాతీయ స్థాయి ప్రముఖ కార్యకర్తలు, నాయకత్వం బైఠక్‌లో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సహసర్‌కార్యవాహ సీఆర్ ముకుంద, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మీడియా సమావేశంలో మూడు రోజుల సమావేశాలలో చర్చించిన అంశాలను గురించి వివరించారు. 
సంఘ్ వైపు యువత పెద్ద సంఖ్యలో ఆకర్షితులు అవుతున్నారని, ఈ ఏడాది, సంఘ్ నిర్వహించిన 21 రోజుల శిక్షణా శిబిరాల్లో సుమారు 21,000 మంది యువ స్వయంసేవకులు పాల్గొన్నారని వారు వెల్లడించారు.  అలాగే దేశవ్యాప్తంగా రోజువారీ శాఖలకు హాజరవుతున్న స్వయంసేవకులలో 60 శాతానికి పైగా యువకులే ఉన్నారని ప్రకటించారు.  యువతలో సంస్కారాలు, సాంస్కృతిక విలువలను కేవలం ప్రసంగాలు లేదా పోస్టర్ల ద్వారా నిర్మించలేం. వారితో నిరంతరం అనుసంధానమై ఉండటం, వారి భావాలను అర్థం చేసుకోవడం, వారితో సంభాషించడం, భారతదేశ గొప్పతనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని అనుభూతి స్థాయిలో వారి ముందుంచడం అవసరమని స్పష్టం చేశారు.  

 
వ్యవస్థలో అవినీతి, వివిధ వ్యవస్థల్లోని లోపాలపై బైఠక్‌లో జరిగిన చర్చలపై స్పందిస్తూ ఈ అంశాన్ని కేవలం అవినీతికి మాత్రమే పరిమితం చేసి చూడలేమని,  వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిచేయడానికి ప్రభుత్వంతో పాటు సమాజంలో కూడా జాగరూకత అవసరం అని భావిస్తున్నట్లు తెలిపారు. నీట్ వంటి అంశాలు కావచ్చు లేదా ఇతర వ్యవస్థాగత సమస్యలు కావచ్చు—వాటి కారణంగా యువతలో తమ భవిష్యత్‌పై ఆందోళన ఏర్పడుతుందని పేర్కొంటూ ఈ ఆందోళనను అర్థం చేసుకోవడం, దానికి పరిష్కారం చూపడం అవసరం అని భావిస్తున్నట్లు చెప్పారు.

యువతతో కేవలం ఉపదేశాత్మక సంభాషణకు బదులుగా వారితో ప్రత్యక్షంగా అనుసంధానం కావడం, వారి భావాలు, ఆందోళనలను అర్థం చేసుకోవడం, సంభాషణ ద్వారా దేశం, సంస్కృతి, సామాజిక విలువల పట్ల ఆత్మీయతను పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు. కేవలం వ్యతిరేకించడం లేదా ఆటంకాలు కలిగించడం ద్వారా పరిష్కారం లభించదని చెబుతూ సానుకూల, నిర్మాణాత్మక దృష్టితో వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం, సమాజం—రెండూ కలిసి ప్రయత్నించాలని తెలిపారు. 

 
దీనితో పాటు మతపరమైన, ఆధ్యాత్మిక, సామాజిక సంస్థలు కూడా యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బజరంగ్ దళ్, హిందూ జాగరణ్ మంచ్ సహా అనేక సంస్థల ద్వారా యువకులు, యువతుల మధ్య పని జరుగుతోందని గుర్తు చేస్తూ నేటి యువత సామర్థ్యం, సానుకూల స్పందనను చూస్తే భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లో సురక్షితంగా ఉందనే విశ్వాసం తమకు ఉన్నట్లు స్పష్టం చేశారు. 
 
అలాగే ఈ సమన్వయ బైఠక్‌లో ఆత్మ నిర్భర భారత్ పై కూడా చర్చ జరిగిందని ముకుంద తెలిపారు. భారతీయత దృష్టికోణంలో అభివృద్ధి నమూనాపై కూడా చర్చించామని, ఆర్థిక రంగంలో క్రియాశీలకంగా వున్న సంస్థల అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటూ, స్వయం సమృద్ధి, పర్యావరణ హితం, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకోయే అభివృద్ధి మోడల్ పై చర్చలు సాగాయని చెప్పారు. 
 

పకృతి వైపరీత్యాల సమయంలో కార్యక్రమాలు 

ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజ ఆధారిత సేవా, పునరావాస కార్యక్రమాలను బైఠక్‌లో సమీక్షించారు.  అస్సాంలో సంభవించిన తీవ్రమైన వరదల సమయంలో రాష్ట్రీయ సేవా భారతి, భారతీయ కిసాన్ సంఘ్, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేష, ఆరోగ్య భారతి సహా వివిధ సంస్థలు, కార్యకర్తలు చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల వివరాలను పంచుకున్నారు. 
 
సంత్ రవిదాస్ జీ 650వ జయంతి సందర్భంగా, వారి సందేశం ఆధారంగా సామాజిక సమరసత, సామాజిక సౌహార్దం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలు, సమాజం నుంచి లభించిన సానుకూల స్పందనను సమీక్షించారు. ఈ దిశగా పనిని నిరంతరం మరింత విస్తరించడంపై చర్చించారు.

బైఠక్‌లో జనసాంఖ్యిక మార్పులు, అసమతుల్యతపై కూడా గంభీరంగా చర్చ జరిగింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో వృద్ధాప్యం వైపు వెళ్తున్న జనాభా, తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా ఏర్పడుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశ పరిస్థితులపై చర్చించారు. వివిధ ప్రాంతాలు, సముదాయాల్లో జనాభా నిష్పత్తుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, వాటి సామాజిక ప్రభావాలపై చర్చిస్తూ సమాజంలో సమతుల్యత, సౌహార్దాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించారు.

దేశంలో యువత, విద్యార్థుల వరకు మాదక ద్రవ్యాల వ్యాప్తి పెరుగుతుండటంపై బైఠక్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల స్థాయిలో కాకుండా, మొత్తం సమాజం భాగస్వామ్యంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు, పరిపాలన, పోలీసులు, ఇతర సంబంధిత వర్గాలను కలుపుకొని నశాముక్త సమాజం కోసం సమన్వయంతో కూడిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరంపై చర్చ జరిగింది

అనేక సంస్థలు వివిధ రకాల సమాజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లఘు ఉద్యోగ్ భారతి సూక్ష్మ పరిశ్రమల రంగంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా ఈ సంవత్సరం 41,000 మందికి పైగా నైపుణ్య శిక్షణ అందించినట్లు కూడా సమాచారం పంచుకున్నారు.

పంచ పరివర్తన్, కుటుంబ ప్రబోధన్

సంఘ్ శతాబ్ది సంవత్సరం నేపథ్యంలో సమాజ పరివర్తన కోసం నిర్దేశించిన *‘పంచ పరివర్తన్’*లోని వివిధ అంశాలపై బైఠక్‌లో ప్రత్యేకంగా చర్చ జరిగింది.
ముఖ్యంగా కుటుంబ ప్రబోధన్‌లో భాగంగా భారతీయ కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువలు, తరతరాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయాలను బలోపేతం చేయాల్సిన అవసరంపై చర్చించారు.

పర్యావరణ పరిరక్షణ విషయంలో కేవలం తీర్మానాలు చేయడానికి పరిమితం కాకుండా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం రోజువారీ జీవితంలో మార్పులు తీసుకురావాలని నొక్కిచెప్పారు. నీటిని వివేకవంతంగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించడం, పచ్చదనాన్ని పెంచడం వంటి అంశాలు ప్రతి కుటుంబం ఆచరణలో భాగం కావాలని పేర్కొన్నారు.

కుత్రిమ మేధ (ఏఐ) సమాజంపై చూపుతున్న పెరుగుతున్న ప్రభావం గురించి బైఠక్‌లో విస్తృత ప్రజెంటేషన్, చర్చ జరిగింది. ఏఐలోని సానుకూల అవకాశాలతో పాటు దానికి సంబంధించిన జాగ్రత్తలు, సవాళ్లపై చర్చిస్తూ, దీనిని భారతీయ దృష్టికోణం, భారతీయ సామాజిక సందర్భంలో చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సాంకేతికతను సమాజ హితం కోసం ఎలా ఉపయోగించాలి, దాని వల్ల సంభవించే ప్రతికూల ప్రభావాలపై సమాజాన్ని ఎలా జాగృతం చేయాలి అనే అంశంపై ముందు కూడా చింతన కొనసాగుతుంది.

సంఘ్ ప్రేరిత 32 సంస్థలు సమాజంలోని వివిధ రంగాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల విస్తరణపై కూడా చర్చ జరిగింది. జాతీయ దృష్టి, సమాజ కేంద్రిత చింతనను సమాజంలోని మరిన్ని రంగాలకు చేరవేయడం, సంస్థాగత కార్యాన్ని విస్తరించడం కోసం రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు.