ఢిల్లీలోని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మెరుపు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించిన ఘటనపై బాధిత విద్యార్థి సాహిల్ లోచబ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన, విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించారు.
రాహుల్ గాంధీ నిరసనకు దిగడంతో అప్రమత్తమైన పోలీసులు పార్లమెంట్ పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా బలగాలను మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు.గత నెల జులై 20న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టిన సమయంలో పోలీసులు పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఈ ఘటనలో సాహిల్‌కు పెల్లెట్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయని, ఒక కంటి చూపు ప్రమాదంలో పడిందని రాహుల్ పేర్కొన్నారు. గాయపడిన సాహిల్‌కు డిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్లో శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపారు. దాంతో సాహిల్ లోచబ్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును తీసుకుని రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై ఢిల్లీ స్థానిక డీసీపీతో కూడా ఆయన చర్చలు జరిపారు. అయినప్పటికీ కేసు నమోదు కాకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దే నిరసనకు దిగారు. ఈ దురాగతానికి హోంమంత్రి అమిత్ షా విద్యార్థులకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రధానమంత్రి కూడా వారికి క్షమాపణ చెప్పలేదని, ఇప్పుడు, సాహిల్ న్యాయం కోసం ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనుకుంటే, దానికి కూడా అనుమతించడం లేదని ధ్వజమెత్తారు.
సాహిల్‌కు, అతడి లాంటి ప్రతి విద్యార్థి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన విషయం తెలియడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు సీనియర్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాహుల్‌కు మద్దతు తెలిపారు.
కాగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసిన రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ బయట రాహుల్ గాంధీ ప్రదర్శించినటువంటి చవకబారు, ప్రచారం కోసం చేసే రాజకీయాలను యావత్ దేశం మరోసారి చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నేటి ధర్నా విద్యార్థుల కోసమో, న్యాయం కోసమో కాదని, ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిస్సహాయతకు, మీడియా దృష్టి కోసం రాహుల్ గాంధీ పడుతున్న ఆరాటానికి ప్రతీక అని ఆయన మండిపడ్డారు.
‘వందేమాతరం’ అంశంపై కాంగ్రెస్ ఇప్పటికే విమర్శల పాలవుతోందని, ప్రజలు సమాధానాలు కోరుతున్నారని, ఆ అవమానం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి రాహుల్ గాంధీ ఆడుతున్న కొత్త నాటకం మాత్రమే ఇది అని ఆయన ఆరోపించారు.
“జూలై 20వ తేదీ ఘటనను సుప్రీంకోర్టు ఇప్పటికే సుమోటోగా స్వీకరించి, ఒక మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్న విషయం యావత్ దేశానికి తెలుసు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంపై విచారణ జరుపుతుండగా, పోలీస్ స్టేషన్ బయట కెమెరాల ముందు కూర్చోవడం ద్వారా రాహుల్ గాంధీ ఏమి నిరూపించాలని ఆశిస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడికి దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం లేదా?” అని ఆయన ప్రశ్నించారు.
నిజం ఏమిటంటే, రాహుల్ గాంధీ కేవలం వార్తల్లో నిలవడానికే ఈ ‘కెమెరా-కేంద్రీకృత’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు,” అని ఆయన విమర్శించారు. మరోవంక, రాహుల్ గాంధీ అరాచక రాజకీయాలు చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు.
“ప్రస్తుతం ఆయన ఎలాంటి అనుమతి, ముందస్తు సమాచారం లేకుండా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు కూర్చున్నారు. ఆయన ప్రస్తావిస్తున్న ఘటనపై ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదైందని, దానిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ఆయనకు తెలియజేశారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాహుల్ గాంధీ, మీరు ఏ చట్టాన్నీ గౌరవించరా?” అని ప్రశ్నించారు.
“జాతీయ గీతం వందేమాతరంపై కాంగ్రెస్ వైఖరి కారణంగానే ఇప్పుడు ఆ పార్టీ ఇరుక్కుపోయిందని మేము అనుమానిస్తున్నాం, ఆరోపిస్తున్నాం. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న దానిని మేము ఖండిస్తున్నాం” అని తెలిపారు.

More Stories
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ
సిపిజే కార్యకర్తలను తరిమి కొట్టిన గ్రామస్థులు
అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత