పాకిస్థాన్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య

పాకిస్థాన్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య
పాకిస్థాన్‌లో మహిళా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై దాడులు ఆగడం లేదు. టిక్‌టాక్‌లో ‘ఆయేషా గిలమానా’గా గుర్తింపు పొందిన 28 ఏళ్ల షంసో బీబీని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీ సాయంత్రం ఇస్లామాబాద్ సమీపంలోని తక్సిలా ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న షంసో, గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 
 
ఆగస్టు 14న షంసో తన 15 ఏళ్ల సోదరి అసీమా, సోదరుడు నెమతుల్లాతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె కారును వెంబడించి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. మెడలో బుల్లెట్ దిగడంతో షంసో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కాల్పుల దాటికి కారు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో ఆమె సోదరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ హత్య వెనుక ఆర్థిక వివాదాలే ప్రధాన కారణమని షంసో తండ్రి ఫజల్ సాహిబ్జాదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌసర్, జావేద్ అనే వ్యక్తులతో తన కుమార్తెకు ఉన్న ఆర్థిక లావాదేవీల్లో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు ఆమెను చంపేస్తామని గతంలో బెదిరించారని పేర్కొన్నారు. ఘటనకు ముందు కాషిఫ్ అనే వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హ‌త్య కేసులో న‌లుగురు అనుమానితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి ప‌రారీ కోసం సాయం చేసిన ఇద్ద‌ర్నీ అదుపులోకి తీసుకున్నారు. క‌నీసం నాలుగేళ్ల నుంచి బీబీ టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న‌ది. ఓ దుస్తుల కంపెనీకి బ్రాండ్ ప్ర‌మోష‌న్ కూడా చేస్తోంది.

గడిచిన ఏడాది కాలంలో పాకిస్థాన్‌లో ఐదుగురు మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్లు హత్యకు గురికావడం గమనార్హం. 2025లో 17 ఏళ్ల సనా యూసఫ్‌ను కూడా ఇదే తరహాలో కాల్చి చంపారు. కాగా, ఈ ఘటన తర్వాత కుటుంబ సభ్యులు షంసో బీబీకి చెందిన టిక్‌టాక్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు.