ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా కింద ఖాళీ అయిన రెండు శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల పేర్లను అధికారికంగా ఖరారు చేసింది. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన బీసీ మహిళా నాయకురాలు దళవాయి రమాదేవిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధించిన ఫైల్‌ను ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సేవలందించిన పండుల రవీంద్రబాబు, జాకియా ఖానమ్‌ల పదవీకాలం పూర్తికావడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ పార్టీకి ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న ఇద్దరు ప్రముఖ నాయకులకు ఈ అత్యున్నత పదవులను కేటాయించాలని నిర్ణయించింది.
దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్య టీడీపీలో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన, గతంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ తరఫున ప్రజా సమస్యలపై గళం విప్పడంలో, అలాగే పార్టీ వాదనలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన 2009లో తిరుపతి లోక్‌సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవి బీసీ (వడ్డెర) సామాజిక వర్గానికి చెందిన అంకితభావం గల నాయకురాలు. గత రెండు దశాబ్దాలుగా పార్టీలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అనంతపురం పార్లమెంట్ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. రమాదేవి కుటుంబం మొదటి నుంచి టీడీపీకి బలమైన మద్దతుదారుగా ఉంది.
ఆమె 2021లో అనంతపురం కార్పొరేటర్‌గా పోటీ చేయడంతో పాటు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకుడికి, క్షేత్రస్థాయిలో అంకితభావంతో సేవలందిస్తున్న మహిళా నేతకు ఈ అవకాశాన్ని కల్పించడం ద్వారా టీడీపీ అధిష్ఠానం సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన రాజ్ భవన్ పరిశీలనలో ఉండగా, గవర్నర్ ఆమోద ముద్ర లభించిన వెంటనే వీరిద్దరి నియామకం అధికారికంగా ఖరారు కానుంది.

More Stories
కృష్ణా జలాల్లో 70 శాతం కేటాయించాలని కోరిన ఏపీ
వందేమాతరం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపుతుంది
ప్రముఖ కళాకారుడు కృష్ణేశ్వరరావు మృతి