హాకీ ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం

హాకీ ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం
మహిళల హాకీ ప్రపంచ కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించింది. పూల్-డి విభాగంలో జరిగిన హోరాహోరీ పోరులో దక్షిణాఫ్రికా జట్టును 6-1 గోల్స్ తేడాతో ఘనంగా ఓడించి సంచలనం సృష్టించింది. ఆరంభ పోరులో చైనాకు ముచ్చెమ‌ట‌లు పట్టించిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. 
 
మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో గోల్స్ వ‌ర్షం కురిపించడం ద్వారా ప్రపంచక‌ప్ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద విజ‌యంతో గ్రూప్ డీ నుంచి అగ్ర‌స్థానంలో నిలిచింది టీమిండియా. నెద‌ర్లాండ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ మహిళ‌ల హాకీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా దుమ్మురేపింది. మొద‌టి మ్యాచ్‌లో చేజారిన విజ‌యాన్ని ఒడిసిప‌డుతూ ద‌క్షిణాఫ్రికాను మ‌ట్టిక‌రిపించారు భార‌త అమ్మాయిలు. గ్రూప్ డీ లీగ్ రెండో పోరులో స‌ఫారీల‌ను కంగుతినిపిస్తూ 6–1తో జ‌య‌భేరి మోగించింది ఆరెంజ్ ఆర్మీ. 
 
ఈ మెగా టోర్నీ చ‌రిత్ర‌లో మొన్న‌టివ‌ర‌కూ 1974లో స్పెయిన్‌పై 4-1 విజ‌య‌మే భార‌త్‌కు అత్యుత్త‌మంగా ఉండేది. కానీ, ఇప్పుడు అది రెండో స్థానానికి ప‌డిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి నుంచి భారత క్రీడాకారిణులు దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఆట ప్రారంభమైన 11వ నిమిషంలోనే సునేలిటా టొప్పో అద్భుతమైన గోల్ సాధించి భారత్‌కు శుభారంభం అందిస్తూ జట్టును 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు.

తొలి సక్సెస్ ఇచ్చిన జోరుతో భారత జట్టు రెండో క్వార్టర్‌లోనూ మరింత ఉత్సాహంగా ఆడింది. ఈ భాగంలోనూ అటాకింగ్ గేమ్‌ను కొనసాగిస్తూ నవ్‌నీత్ కౌర్, సుశీలా చాను తలా ఒక గోల్ కొట్టి స్కోరు బోర్డును మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆట మూడో భాగంలో భారత ఫార్వర్డ్ లైనర్స్ మరింత విజృంభించి ఆడారు. 

దీపికా, లాల్రెమ్సియామి, రాణా సాక్షి వరుసగా గోల్స్ సాధించి దక్షిణాఫ్రికా డిఫెన్స్‌ను పూర్తిగా దెబ్బతీశారు. ఈ దశలో వచ్చిన గోల్స్‌తో భారత్ విజయం తిరుగులేని విధంగా ఖరారైంది. మొత్తంగా అటాకింగ్ , డిఫెన్స్‌లో అద్భుత సమన్వయం కనబరిచిన భారత మహిళల హాకీ జట్టు, దక్షిణాఫ్రికాపై 6-1 గోల్స్ తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుని ప్రపంచ కప్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. 

మ‌రో మ్యాచ్‌లో చైనా ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇక చివ‌రి గ్రూప్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఆగ‌స్టు 20, గురువారం నాడు ఇంగ్లండ్‌ను ఢీకొట్ట‌నుంది. మ‌రొక్క పాయింట్ సాధిస్తే చాలు రెండో రౌండ్ ఆడ‌డం ఖాయం.