వందేమాతరం అవమానించిన కాంగ్రెస్.. బీజేవైఎం నిరసన

వందేమాతరం అవమానించిన కాంగ్రెస్.. బీజేవైఎం నిరసన
వందేమాతరం గేయం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు అవమానకరంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ నాంపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే మాట్లాడుతూ, వందేమాతరం భారత స్వాతంత్ర్యోద్యమంలో కోట్లాది భారతీయుల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపిన జాతీయ గేయమని స్పష్టం చేశారు. 

అలాంటి పవిత్రమైన గేయం పట్ల అవమానకరంగా వ్యవహరించడం దేశభక్తిని గౌరవించే ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా దేశ గౌరవం, జాతీయ భావాలు, దేశభక్తి విషయంలో బీజేవైఎం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు దేశ ప్రజల మనోభావాలను గౌరవించి, వందేమాతరం గేయం పట్ల తమ వైఖరిపై స్పష్టత ఇవ్వాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమంలో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు కలిసి పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపించి, దేశభక్తి,  జాతీయ గౌరవం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. 
 
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవినోళ్ళ హరిశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిత రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు శివ చంద్రగిరి, అరవింద్ రెడ్డి, ఝాన్సీ, హరిప్రసాద్, చక్రి, అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “వందేమాతరం గేయాన్ని గౌరవిద్దాం – దేశ గౌరవాన్ని కాపాడుదాం” అంటూ బీజేవైఎం నాయకులు నినదించారు.