బీహార్ అశోక్ ధామ్ ఆలయం ప్రాంగణంలో తొక్కిసలాట

బీహార్ అశోక్ ధామ్ ఆలయం ప్రాంగణంలో తొక్కిసలాట
* ఏడుగురు మహిళా భక్తులు మృతి 

బిహార్ లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట జరగ్గా, ఏడుగురు భక్తులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాఏర్పడిందియపడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. శ్రావణ మాసం మూడో సోమవారం (ఉత్తరాది లెక్కల ప్రకారం) కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. 

జలాభిషేకం చేయడానికి సుమారు 50,000 మంది భక్తులు తరలివచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తొక్కిసలాట జరిగింది. అయితే తొక్కిసలాట అనంతరం భక్తులు ఒక్కసారిగా అరుస్తూ పరిగెత్తారు. ఈ క్రమంలో చాలా మంది భక్తులు ఒకరిపై ఒకరు పడి నలిగిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పరిపాలనా బృందం సహాయక చర్యలు చేపట్టింది. 

లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్  శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఉదయం 6:30 నుండి 6:45 గంటల మధ్య రెండు రైళ్లు అక్కడికి చేరుకున్నప్పుడు జనం “అనూహ్యంగా” పెరిగిపోయారని తెలిపారు.  అధికారులు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ, జనాల రద్దీ కారణంగా ఒక వైపు బారికేడ్లు విరిగిపోవడంతో పలువురు కింద పడిపోయారని, అయితే అధికారులు వెంటనే స్పందించారని ఆయన చెప్పారు. 

“భక్తుల క్యూ అశోక్‌ధామ్ హాల్ట్ వరకు విస్తరించింది. అక్కడ రెండు రైళ్లు ఆగాయి. అకస్మాత్తుగా అక్కడ ఒక విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఆ స్తంభం పురుషుల క్యూకు కుడి వైపున ఉంది. స్తంభం కూలినప్పుడు, ప్రజలపై విద్యుత్ తీగ (లైవ్ వైర్) పడిందనే వదంతులు వ్యాపించాయి, కానీ అది కేవలం ఒక కేబుల్ వైర్ మాత్రమే,” అని ఆయన పేర్కొన్నారు. 

“దీనివల్ల ఎడమ వైపున ఉన్న మహిళల క్యూపై ఒత్తిడి పెరిగింది. దాంతో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. తెల్లవారుజామున 3 గంటల నుండే పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. ఇదంతా కేవలం 2 నిమిషాల వ్యవధిలో అకస్మాత్తుగా జరిగింది. మేము ప్రస్తుతం సదర్ ఆసుపత్రిలో ఉన్నాము. మరణించిన వారందరూ మహిళలే. మృతుల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారించే పనిలో ఉన్నాము,” అని ఆయన తెలిపారు.

ఈ ఘటనను “అత్యంత విషాదకరమైనది, హృదయ విదారకమైనది” అని పేర్కొన్న ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు తక్షణమే సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా హిందీలో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. అశోక్ ధామ్ ఆలయాన్ని ‘శ్రీ ఇంద్రదమనేశ్వర మహాదేవ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇందులో ఒక పెద్ద శివలింగం ఉంది. ముఖ్యంగా పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది.