మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర పరారీలో ఉన్న నిందితులను బంగ్లాదేశ్‌కు అప్పగించే వరకు తమ ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రతిపాదిత భారత పర్యటన సాధ్యం కాకపోవచ్చని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆదివారం స్పష్టం చేసింది. ద్వైపాక్షిక పర్యటనపై ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, అనుకూలమైన వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని తెలిపింది.
వ్యక్తులను అప్పగించే విషయంలో న్యూఢిల్లీ ముందుకు రాకపోతే, తారిక్ రెహమాన్ భారత్‌లో పర్యటించే అవకాశం లేదని బంగ్లాదేశ్ తెలిపింది. ఢిల్లీలో ఆగస్ట్ 5న షేక్ హసీనా పాల్గొన్న ఒక బహిరంగ మీడియా సమావేశం పర్యటన వాతావరణాన్ని దెబ్బతీసిందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎస్‌కేఎమ్ షాహిదుల్ కరీమ్ పేర్కొన్నారు.
“ఈ పర్యటనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాలని మేము భావిస్తున్నాము. దీని కోసం, షేక్ హసీనా, ఇతర పరారీలో ఉన్న నేరస్తులను అప్పగించాలన్న మా అభ్యర్థనపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, అలాగే మా ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం షహీద్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యలో నిందితులను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని మేము భారత అధికారులను కోరాము. వారి స్పందన కోసం మేము వేచి చూస్తున్నాము” అని కరీం స్పష్టం చేశారు.
రాజకీయ కార్యకర్త ఉస్మాన్ హాదీ హత్యలో నిందితులైన ఇద్దరు వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) మార్చిలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సరిహద్దు పట్టణమైన బొంగావ్ నుండి అరెస్టు చేసింది. “సార్వభౌమ సమానత్వం, జాతీయ గౌరవం, పరస్పర అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా పొరుగు దేశాలతో సహా ఇతర దేశాలతో స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి మా ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ విధానాన్ని కొనసాగిస్తామని మేము పునరుద్ఘాటిస్తున్నాము,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు గాను బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాను దోషిగా నిర్ధారించినప్పటికీ, న్యూఢిల్లీలో ఆమె బహిరంగంగా మీడియా సమావేశంలో పాల్గొనడం వల్ల రెహమాన్ పర్యటనకు సంబంధించిన ప్రక్రియ “దెబ్బతిన్నదని” బంగ్లాదేశ్ పేర్కొంది. అయితే, హసీనా, బంగ్లాదేశ్ అధికారులతో కూడిన ఆ మీడియా సమావేశానికి భారత ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
హసీనాకు సంబంధించి బంగ్లాదేశ్ నుండి వచ్చిన అప్పగింత అభ్యర్థన “పరిశీలనలో” ఉందని భారత్ గతంలోనే తెలిపింది. విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారిన తర్వాత, ఆగస్టు 2024లో హసీనా అధికారం నుండి తొలగించారు. ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఆమె భారత్‌కు పారిపోయి అక్కడే ఉండిపోయారు.

More Stories
ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేసిన యూఏఈ
హాకీ ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం
ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం