రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఐదేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగాయి. రెండు దేశాలు భారీగా సైనికులను కోల్పోయాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ వెయ్యికిపైగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చేసిన ఈ దాడుల్లో ఎనిమిది వందల డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కీవ్ చేసిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఒకటైన ఈ ఘటనలో రష్యాలో ఆరుగురు మరణించారు. రాత్రికి రాత్రే ఉక్రెయిన్ ప్రయోగించిన 822 డ్రోన్లను తాము ధ్వంసం చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 600 డ్రోన్లు రాజధాని మాస్కో వైపు దూసుకురాగా, వాటిలో మూడింట ఒక వంతు డ్రోన్లను మాస్కో ప్రాంతంలోనే ధ్వంసం చేసినట్లు మేయర్ సెర్గీ సోబ్యానిన్ చెప్పారు.
నైరుతి రష్యాలో రోస్టోవ్ ప్రాంతంలో 150కిపైగా డ్రోన్లతో 3 పట్టణాలపై ఉక్రెయిన్ చేసిన దాడిలో ఐదుగురు మరణించారని స్థానిక గవర్నర్ యూరీ స్ల్యూసర్ తెలిపారు. దాడిలో ఇళ్లు, రైల్వే స్టేషన్ దెబ్బతిన్నాయి. అడవిలో మంటలు చెలరేగాయి. మాస్కో ప్రాంతంలో ఒక డ్రోన్ ప్రైవేట్ ఇంటిని ఢీకొట్టి 83 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.
మాస్కోలోని పలు ప్రదేశాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. మాస్కో ఆయిల్ రిఫైనరీకి సమీపంలోనూ ఈ దాడులు జరగడంతో అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ వ్యాపించింది. దాడుల కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దాంతో పలు విమానాలు రద్దవ్వగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి.
క్రిమియాపైనా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. సైనిక సరఫరాలను, విద్యుత్తు వ్యవస్థలను స్తంభింపజేసేలా తాజా దాడులు జరిపింది. క్రిమియాలోని క్షిపణి వ్యవస్థలపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సైనిక, ఇంధన కేంద్రాలతో పాటు రష్యాకు చెందిన భారీ ఆన్లైన్ రిటైల్ సంస్థ ‘వైల్డ్‌బెర్రీస్’ గోదాములను లక్ష్యంగా చేసుకుంది. పోడోల్స్క్ పట్టణంలో జరిగిన దాడి వల్ల బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన సరుకు కాలి బూడిదైంది.
మరోవైపు, ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. క్రివీ రిహ్ నగరంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఇద్దరు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు.

More Stories
హాకీ ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం
ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
ఉక్రెయిన్‌లో లక్ష్మి మిట్టల్ ఉక్కుపై రష్యా క్షీపనుల దాడి