సీఎం సొరేన్ రాజీనామాకై 20న ఆయన నివాసం ముట్టడిస్తాం 

 

* నేడే సొరేన్, రాహుల్ దిష్టి బొమ్మలు దగ్ధం 
 
జార్ఖండ్ నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థులు దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం రాంచీలో ‘త్రివర్ణ యాత్ర’ చేపట్టారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా కోరుతూ ఆగస్టు 20న ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని కూడా ప్రకటించారు. నియామక పరీక్షల వ్యవస్థలో మరింత పారదర్శకత, సంస్కరణలు సాధించాలనే తమ డిమాండ్‌ను నెరవేర్చేందుకు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాంచీలో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు ‘త్రివర్ణ యాత్ర’లో పాల్గొంటున్న తరుణంలో ఈ ప్రకటనలు వెలువడ్డాయి. 
 
వీరిలో నిరాహార దీక్ష చేస్తున్న వీల్‌చైర్‌లోని ఇద్దరు నిరసనకారులు కూడా ఉన్నారు. ఈ నిరసన 22వ రోజుకు చేరుకుంది. “ఆగస్టు 20న మేము ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాము. జేఎంఎం, కాంగ్రెస్ రెండూ మాతో రాజకీయాలు చేస్తున్నందున ఆయన రాజీనామా చేయాలని మేము కోరుతున్నాము. ఒకవేళ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ మాట వినకపోతే, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి ఆయన మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము,” అని జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ నాయకుడు రవీంద్ర పాశ్వాన్ ప్రకటించారు. 
 
అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న పరీక్షలను రద్దు చేయడం, నియామక ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరపడం వంటి తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరసనను విరమించబోమని నిరసనకారులు తెలిపారు. తమ సమస్యల విషయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం)-కాంగ్రెస్ కూటమి రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని హెచ్చరించడంతో, జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసన ఆదివారం మరోసారి ఉధృతం కానుంది. 
 
తమ డిమాండ్లపై అధికార కూటమి ఎటువంటి “కచ్చితమైన చర్యలు” తీసుకోలేదని ఆరోపించిన నిరసనకారులు, ఆదివారం రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల్లో సోరెన్, గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ప్రకటించారు.  జేపీఎస్‍సీ-  జేఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆగస్టు 18 వరకు గడువు విధించారు. 
 
నియామక పరీక్షలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు సిఫార్సు చేయడంలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైతే, తాను నిరాహార దీక్షకు దిగుతానని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ గతంలోనే హెచ్చరించారు.  రాష్ట్రంలో నియామక పరీక్షలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై వేలాది మంది విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్న తరుణంలో బీజేపీ నేత ఈ హెచ్చరిక చేశారు. 
 

 

 
 

 

About The Author