స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల ఫోటోలపై దుమారం 

స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల ఫోటోలపై దుమారం 
* ప్రధాని మోదీ బొమ్మ ముద్రించాలి.. బిజెపి ఎంపీలు 
 
తెలంగాణలో రేషన్‌కార్డు లబ్ధిదారులకు సరికొత్త భద్రతా ఫీచర్లతో జారీ చేస్తున్న స్మార్ట్‌కార్డులలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫొటోలు ఉండటంపై రాజకీయ దుమారం చెలరేగనుంది. సుదీర్ఘకాలం ఉండే రేషన్‌కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటం ఏమిటని బీజేపీ సహా విపక్షాలు, వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి స్మార్ట్‌రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించనుంది. 
 
భవిష్యత్తులో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారినప్పుడు ఈ స్మార్ట్‌కార్డుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వంలో మార్పుల సంగతి వదిలేస్తే మంత్రులు, శాఖల మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ. అలా జరిగితే పాత రేషన్‌ స్మార్ట్‌ కార్డులను కొనసాగిస్తారా? మారుస్తారా? కొత్తకార్డులు ముద్రిస్తారా? ఒకవేళ కొనసాగించాలనుకుంట కొత్తగా పదవిలోకి వచ్చిన మంత్రులు అంగీకరించగలరా? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుందన్న అంశాలపై చర్చ జరుగుతోంది. 
 
గత ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 61,08,544 మందికి లబ్ధికలిగేలా 16,32,810 కుటుంబాలకు రేషన్‌కార్డులు మంజూరుచేసింది. దీనితో రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల సంఖ్య 1,06,28,092కు, లబ్ధిదారుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది. దేశంలో ఇప్పుడే తొలిసారిగా రేషన్‌కార్డుల పంపిణీ చేపడుతున్నట్టుగా, రేషన్‌ బియ్యం ఇప్పుడే తొలిసారిగా పంపిణీ చేస్తున్నట్టుగా కాంగ్రెస్‌ సర్కార్‌ హంగూ ఆర్భాటాలు చేస్తుందని బిఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
1.06 కోట్ల స్మార్ట్‌ రేషన్‌కార్డుల ముద్రణ కోసం ప్రభుత్వం 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. గతంలో రేషన్‌కార్డుపై ఆ కార్డులో సభ్యులైన కుటుంబసభ్యుల ఫొటోలను ముద్రించి పంపిణీ చేశారు. కానీ, ఇప్పు డు కుటుంబసభ్యుల ఫొటోలు కాకుండా సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ ఫొటోలను ముద్రిస్తున్నది. ఈ కార్డు మీద లబ్ధిదారుల ఫొటో లు కానీ, కనీసం వారి పేర్లు కానీ ముద్రించడంలేదు. కుటుంబ పెద్ద పేరు మాత్రమే ముద్రిస్తున్నారు.

స్మార్ట్‌ రేషన్‌కార్డులో అత్యాధునిక తొమ్మిది సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచినట్టు ప్రభుత్వం చెప్తున్నది. అసలు ఆ కార్డుతో అదనంగా ఎలాంటి ప్రయోజనం లేదనేది స్పష్టం అవుతుంది. ఇక సెక్యూరిటీ ఫీచర్లు ఉంటే ఏంది? లేకుంటే ఏంది? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చేసే అవకాశం ఉంటుందా? అంటే అదీ లేదు. ఒకవేళ పీవోఎస్‌ మిషన్‌లో రేషన్‌కార్డు నంబర్‌ ఎంటర్‌ చేయకుండా, కేవలం కార్డును స్వైప్‌ చేస్తే రేషన్‌ వస్తుందా? అంటే అదీలేదు. 

ఇప్పటివరకు రేషన్‌కార్డు లేకపోయినా రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. ఇప్పుడు స్మార్ట్‌ కార్డు పంపిణీ చేసినప్పటికీ, ఆ కార్డును తీసుకెళ్లపోయినా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తారు. ఇలా ఒక్కటంటే ఒక్క ప్రయోజనం కూడా లేని కార్డులకు సెక్యూరిటీ ఫీచర్లంటూ ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్‌ సర్కార్‌కే చెల్లిందనే విమర్శలొస్తున్నాయి.

మరోవంక, రాష్ట్రంలో పేదలకు అందించే బియ్యంలో చాలా వరకు కేంద్రమే అందజేస్తోందని, అందువల్ల రేషన్‌కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ముద్రించాలని బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం చొప్పున ఉచితంగా అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కిలో బియ్యం అందిస్తూ ఆర్భాటపు ప్రచారం చేసుకుంటోందని రఘునందన్‌రావు విమర్శించారు. 
 
ఒక్క కిలో బియ్యం ఇస్తూ కార్డుపై కాంగ్రెస్‌ నేతల ఫొటోలు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీని వెంటనే నిలిపేసి, అన్ని కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించి, పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. మోదీ ఫోటోను ముద్రించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. స్మార్ట్‌ రేషన్‌కార్డుల ముద్రణలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 
 
రేషన్‌కార్డుల ముద్రణ ఖర్చులు, టెండర్లు, కాంట్రాక్టు వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, పేదలకు అందించే రేషన్‌ బియ్యంలో 90శాతం నిధులు కేంద్రానివేనని, ప్రొటోకాల్‌ ప్రకారం రేషన్‌కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు.