సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సమర్ధించిన ఒమర్ అబ్దుల్లా

సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సమర్ధించిన ఒమర్ అబ్దుల్లా
 
పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఉన్న సిందు నదీ జలాల ఒప్పందాన్ని  రద్దు చేస్తూ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమర్ధించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ వల్ల మన రక్తమే ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
“కాశ్మీర్ ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడూ ముందుగా ఆలోచిస్తామని పాకిస్తాన్ తరచూ అంటూ ఉంటుంది. మరి నీళ్ల విషయంలో ఆ వైఖరి ఏమైంది? మా నీళ్లను మేం వాడుకుంటున్నాం. ఇది తప్పా? ఔను.. ఇది మా రక్తం (సింధు నదీ జలాలను గురించి). మా రక్తం ఇంకిపోయేలా చేసింది పాకిస్తాన్. ఈ నీళ్లు మావి. నదులు మావి. మా నదుల్ని, నీళ్లను వాడుకునే హక్కు మాకు ఉంది” అని స్పష్టం చేశారు. 
 
సింధు నదీ వ్యవస్థకు సంబంధించిన ప్రతి నీటి చుక్క ఇస్లామాబాద్‌కు ఒక “రెడ్ లైన్” (అతి కీలకమైన అంశం) అని, ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్న నేపథ్యంలో ఒమర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ సరైన మార్గంలోకి రాకపోతే, పాకిస్థాన్ ‘నేరుగా స్పందిస్తుందని’ కూడా పాక్ ప్రధాని హెచ్చరించారు. 
 
“కాశ్మీర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నామని పాక్ చెబుతుంటుంది. మరి నీళ్ల అంశానికి వచ్చేసరికి వారి వైఖరి ఎందుకు మారింది? మా నదుల నీళ్లను మేం వాడుకుంటుంటే తప్పేంటి? మా నీళ్లను పాక్ వాడుకునేటప్పుడు కాశ్మీర్ ప్రజలపై వారి ఆందోళన ఏమైంది? ఇక్కడ మాకు ఆరు నదులున్నాయి. వాటిలో మూడు పంజాబ్‌ నుంచి ప్రవహిస్తాయి. వాటిని పూర్తిగా భారత్ నే వాడుకుంటుంది. మిగతా మూడింటిని పాకిస్తాన్‌కు ఇచ్చేశాం” అని గుర్తు చేశారు.“పాకిస్తాన్‌తో సింధు నదీ జలాల వల్ల మేం చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. చీనాబ్ నుంచి మేం తాగునీళ్లు కూడా తెచ్చుకోలేకపోయాం. తుల్బుల్‌పై బ్యారేజ్ కూడా కట్టలేకపోయాం. వ్యవసాయం కోసం జీలం నదిని కూడా వాడుకోలేకపోయాం. ఈ నదుల నీటిని నిల్వ చేయడానికి ఒక పెద్ద డ్యాం కూడా కట్టలేకపోయాం. అందుకే అది మా రక్తం” అని ఆయన తేల్చి చెప్పారు.

సింధు నదీ జలాల ఒప్పందం అందుకే రద్దైందని చెబుతూ ఈ ఒప్పందం ఇలాగే రద్దు కావాలని, అప్పుడే మనం మన నీటిని సరిగ్గా వాడుకోగలం అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.