ఎన్నికల సంఘం (ఇసిఐ) వెరిఫికేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఆర్‌బిఐ ఉద్యోగిని బురిడీ కొట్టించి రూ.3.27 లక్షలు కాజేశారు. అమీర్‌పేట్‌కు చెందిన బాధితుడిని ఇసిఐ అధికారి పేరుతో బాధితుడిని సంప్రదించిన కేటుగాళ్లు 48 గంటల్లో ఎన్నికల సంఘం వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని నమ్మించారు. అనంతరం వాట్సాప్ ద్వారా లింకులు, ఏపికె ఫైల్ పంపించి మోసానికి పాల్పడ్డారు.
బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బాధితుడికి ఇసిఐ అధికారి పేరుతో ఓ నకిలీ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఎన్నికల సంఘం వెరిఫికేషన్ ప్రక్రియను 48 గంటల్లో పూర్తి చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. అనంతరం సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా బాధితుడిని సంప్రదించారు.
వెరిఫికేషన్ కోసం తొలుత కేవలం నాలుగు రూపాయలు చెల్లించాలని చెబుతూ ఓ లింక్ పంపించారు. ఆ లింక్ ద్వారా చెల్లింపు చేయించే క్రమంలో ఇసిఐ కస్టమర్ సపోర్ట్ పిడిఎఫ్.ఏపికె పేరుతో ఓ ఫైల్‌ను బాధితుడితో డౌన్‌లోడ్ చేయించారు. అనంతరం నిందితులు వీడియో కాల్‌లో మాట్లాడుతూ చెల్లింపు విఫలమైందని నమ్మించి మరోసారి ఐదు రూపాయలు పంపించాలని సూచించారు.
ఏపికె ఫైల్ డౌన్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే బాధితుడి బ్యాంకు ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.3.25 లక్షలు మాయం కాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఖాతా నుంచి మరో రెండు వేలు కట్ అయ్యాయి. మొత్తం రూ.3.27 లక్షలు కోల్పోయినట్లు బాధితుడు గుర్తించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు పంపిన లింకులు, ఏపికె ఫైల్, ఫోన్ నంబర్లు, బ్యాంకు లావాదేవీల వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద ఏపికె ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ఎన్నికల సంఘం పేరుతో వచ్చే సందేశాలను పూర్తిగా నమ్మకుండా అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు. ఫోన్‌లో అనుమానాస్పద యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం లేదా తెలియని వ్యక్తులతో బ్యాంకింగ్ వివరాలు, ఒటిపిలు, పాస్‌వర్డ్‌లు పంచుకోవడం వద్దని తెలిపారు.

More Stories
కమీషన్ కోరారని భట్టి భార్యపై గవర్నర్‌కు ఫిర్యాదు!
హర్ ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోంది
రూ. 4 లక్షల కోట్ల అప్పులతో తెలంగాణాలో ఆర్థిక అత్యవసర పరిస్థితి