ఆస్ప‌త్రి గది చార్జీలు 3-స్టార్ హోటళ్ల కంటే ఎక్కువ కాకూడదు 

ఆస్ప‌త్రి గది చార్జీలు 3-స్టార్ హోటళ్ల కంటే ఎక్కువ కాకూడదు 
దేశంలోని మెట్రో నగరాలలో ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న గది అద్దెలకు పరిమితి విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఆయా ఆసుపత్రుల సమీపంలోని 3-స్టార్ హోటళ్ల  సగటు అద్దె కంటే ఈ ఛార్జీలు అధికంగా ఉండకూడదని స్పష్టంచేసింది. పెరుగుతున్న వైద్య ఖర్చులను అదుపులోకి తీసుకువచ్చి రోగులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కమిటీ ఈ కీలక సూచనలు చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 176వ నివేదికలో ఈ సిఫార్సులను పొందుపరిచింది. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అందుబాటు-స్తోమత’ పేరిట రూపొందించిన ఈ నివేదికను ఆగస్టు 7న పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాలు, సేవలను బట్టి గది అద్దెల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, తక్షణమే వీటిని హేతుబద్ధీకరించాలని కమిటీ సూచించింది. 

“ఆసుపత్రి బిల్లింగ్ నిర్మాణ విభజనను విశ్లేషించిన మీదట, గది ఛార్జీలను అత్యవసర ప్రాతిపదికన హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కమిటీ భావిస్తోంది,” అని రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని ప్యానెల్ పేర్కొంది. ఈ నిబంధన కేవలం ప్రాథమిక గది అద్దెకే వర్తిస్తుందని, రెసిడెంట్ డాక్టర్, నర్సింగ్, భోజనం ఖర్చులను ఆసుపత్రులు అదనంగా వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 

జాతీయ నమూనా సర్వే (2025) గణాంకాలను కమిటీ ఈ సందర్భంగా ఉటంకించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సగటు చికిత్స వ్యయం రూ.6,631 గా ఉండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో అది రూ.50,508గా ఉందని పేర్కొంది.  ఉదాహరణకు ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సింగిల్ రూమ్ అద్దె రోజుకు రూ.6,000 నుంచి రూ.12,000 వరకు ఉండగా, సమీపంలోని 3-స్టార్ హోటళ్లలో అది రూ.2,500 నుంచి రూ.4,500 మధ్యే ఉందని నివేదికలో వివరించింది. 

గది అద్దెలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలోని కీలక చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల ధరలను కూడా నియంత్రించేలా ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. చికిత్స ప్రారంభించడానికి ముందే అంచనా వ్యయాన్ని రోగులకు వివరించాలని సూచించింది. 

ఆసుపత్రి ఛార్జీలను ప్రామాణీకరించే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈ పరిశోధన ఫలితాలు వెలువడ్డాయి. వివిధ ప్రాంతాల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (కేంద్ర ప్రభుత్వ) నిబంధనల కింద అన్ని సౌకర్యాలకు ఒక ప్రామాణిక రుసుము పరిధిని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.