యుద్ధ నేరాల కేసులో సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

యుద్ధ నేరాల కేసులో సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్- అసద్‌ను యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల కేసులో ఆ దేశ న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. 14 ఏళ్లపాటు సాగిన సిరియా అంతర్యుద్ధ కాలంలో దాదాపు 5 లక్షల మంది మరణాలకు కారణమయ్యారని అసద్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో సిరియా మాజీ సైనికాధికారి అయిన ఆయన తమ్ముడు మహేర్ అల్-అసద్‌, మేనత్త కుమారుడు అటెఫ్ నజీబ్‌లకు కూడా మరణశిక్ష పడింది. 
 
సిరియా సైన్యం మాజీ బ్రిగేడియర్ జనరల్ అయిన నజీబ్ 2011లో అసద్ హయాంలో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్సుల ‘పొలిటికల్ సెక్యూరిటీ బ్రాంచ్’కు చీఫ్‌గా ఉండేవారు. అక్కడ అణచివేత చర్యలకు నాయకత్వం వహించిన అతడు ప్రజా తిరుగుబాటుకు, తదనంతర అంతర్యుద్ధానికి ఆయన కారణమయ్యారు. ‘‘15 ఏళ్ల లోపు పిల్లలను ఉద్దేశపూర్వకంగా చంపడం, మరణానికి దారితీసేలా హింసించడం’’ వంటి చర్యలకు నజీబ్ పాల్పడ్డారని కోర్టు తీర్పునిచ్చింది. 
 
ఆయన చర్యలు ‘మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు’ అని పేర్కొంటూ మరణశిక్షను ఖరారు చేసింది. 2024 డిసెంబర్‌లో ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌‌లోకి ప్రవేశించడంతో తన సోదరుడు సహా కుటుంబ సభ్యులతో కలిసి అల్ అసద్ రష్యాకు పారిపోయాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన అసద్ కుటుంబం పాలన ముగియడంతో ఒకప్పుడు అమెరికా ఉగ్రవాదిగా ముద్రవేసిన అల్-ఖైదా మాజీ కమాండర్ అహ్మద్ అల్- షరా  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 
 
సిరియాలోనే ఉండిపోయిన నజీబ్‌ను తర్వాత నిర్బంధించారు.  దీంతో విచారణ ఎదుర్కొన్న అత్యున్నత స్థాయి అధికారులలో ఒకరిగా అతడు నిలిచారు. అసద్, అతడి కుటుంబ సభ్యులకు వెలువడిన ఈ తీర్పు గత ప్రభుత్వంలోని వ్యక్తులపై ప్రత్యక్షంగా, వారి గైర్హాజరీలో విచారణ ప్రారంభించిన తాత్కాలిక అధికారుల ఆధ్వర్యంలో వచ్చిన మొదటిది. 50 సంవత్సరాలకు పైగా సిరియాను అసద్ కుటుంబం పాలించింది. మొదట హాఫెజ్ అసద్  ఆ తర్వాత అతడి కుమారుడైన బషర్ అల్-అసద్ పాలించారు.
 
సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం 2011లో వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు 13 ఏళ్ల పాటు సాగి క్రూరమైన అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ సంఘర్షణలో ఐదు లక్షల మందికి పైగా మరణించారు. లక్షలాది మంది లెబనాన్, జోర్డాన్, టర్కీ, ఐరోపాలకు పారిపోయారు. 2024 డిసెంబ‌ర్‌లో అస‌ద్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీ ర‌ష్యాకు ప‌రారీ అయిన విష‌యం తెలిసిందే. హ‌య్య‌త్ తాహిర్ అల్ షామ్ నేతృత్వంలోని విప‌క్ష ద‌ళాలు డ‌మ‌స్క‌స్‌కు దూసుకురావ‌డంతో బాష‌ర్ దేశం విడిచి పారిపోయారు. దీంతో సిరియాలో సుమారు 50 ఏళ్ల అస‌ద్ ఫ్యామిలీ పాల‌న అంత‌మైంది.