జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికై యత్నం.. విద్యార్థులపై లాఠీఛార్జ్, వాటర్‌ కెనాన్లు 

జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికై యత్నం.. విద్యార్థులపై లాఠీఛార్జ్, వాటర్‌ కెనాన్లు 

* జేపీఎస్‍సీ మాజీ చైర్మన్ ఖియాంగ్టే అరెస్ట్ 

జార్ఖండ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌, జార్ఖండ్ స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, వీటిపై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ జార్ఖండ్ విద్యార్థులు సోమవారం రాంచీలోని అసెంబ్లీ వైపు ర్యాలీ చేప‌ట్టారు. వేల సంఖ్య‌లో విద్యార్థులు ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, విద్యార్థుల ప్ర‌తినిధుల మ‌ధ్య మూడో ద‌ఫా చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో సోమ‌వారం అసెంబ్లీ దిశ‌గా విద్యార్థులు ర్యాలీ తీశారు. 
 
8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న స్టూడెంట్ నేత దేవేంద్ర నాథ్ మ‌హ‌తో అంబులెన్సులో అసెంబ్లీ మార్చ్ చేప‌ట్టారు. జార్ఖండ్ విద్యార్థులు కీల‌కంగా రెండు డిమాండ్లు చేస్తున్నారు. జెఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యువేట్ లెవ‌ల్ ఎగ్జామ్‌ను ర‌ద్దు చేయాల‌ని, రిక్రూట్మెంట్ ప‌రీక్ష‌ల్లో జ‌రిగిన అవ‌క‌త‌క‌వ‌ల‌పై సీబీఐ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. అయితే 14వ జేపీఎస్‌సీ నియామక పరీక్షను రద్దు చేస్తామని ప్ర‌భుత్వం ఆదివారం హామీ ఇచ్చినా, విద్యార్థులు మాత్రం ఇవాళ ఆందోళ‌న విర‌మించ‌లేదు.

జైపాల్ సింగ్ ముండా స్టేడియం వ‌ద్ద ఉదయం భారీ సంఖ్య‌లో విద్యార్థులు గుమ్మికూడారు. ఛ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మంలో భాగంగా తొలుతు పోలీసు బారికేడ్ల‌ను తొల‌గించారు. రాంచీ ధ‌ర్నా కేంద్రానికి చేర‌డానికి ముందు పోలీసులు అనేక సార్లు అడ్డుకున్న‌ట్లు విద్యార్థులు చెప్పారు. ఛ‌లో అసెంబ్లీ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ బారికేడ్లు పెట్టినా, త‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌కున్నా, తాము ర్యాలీ ఆప‌లేద‌ని స్పష్టం చేశారు. 

ఇదేమైనా పాకిస్థానా, బంగ్లాదేశా, చైనా స‌రిహ‌ద్దా? అని ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌ను ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. అసెంబ్లీ వైపు దూసుకువ‌స్తున్న విద్యార్థుల‌పై వాట‌న్ కెనాన్ల‌తో దాడి చేశారు. భారీ సంఖ్య‌లో వ‌స్తున్న విద్యార్థుల‌ను అడ్డుకునే క్ర‌మంలో పోలీసులు ఓ ద‌శ‌లో ఆందోళనకారులపై  లాఠీఛార్జ్ చేశారు. 

జాతీయ జెండాలు చేతపట్టిన విద్యా‌ర్థులు బారికేడ్లను తోసుకుని అసెంబ్లీ వైపు ముందుకు వెళ్లేందుకు నిరసనకారులు తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను ఛేదించుకుని వస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై జల ఫిరంగులు ప్రయోగించారు. 

అయితే, ఈ ఉద్రిక్తతల మధ్య పలువురు విద్యార్థులు బారికేడ్ల పైకి ఎక్కి నిలబడ్డారు. పోలీసులు తమపైకి వాటర్ క్యానన్లతో నీటిని కొడుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఆ నీటి ధారల మధ్యే బారికేడ్ల పైనే డ్యాన్స్ చేస్తూ తమ నిరసనను వినూత్నంగా వ్యక్తపరిచారు. నిరసనల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వేలాది మంది రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాంచీకి చేరుకున్నారు. 

విద్యార్థులు పెద్ద సంఖ్యలో నగరంలోకి చేరుకోకుండా జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులు, హైవేల వద్ద బస్సులు, ప్రైవేటు వాహనాలను తనిఖీ చేశారు. ముందు జాగ్రత్తగా రాంచీలో చాలా పాఠశాలలను మూసివేశారు. మరోవైపు, విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా సీఎం హేమంత్‌ సోరెన్‌ నివాసం వెలుపల బీజేపీ నేతలు నిరసనకు దిగారు. నియామక పరీక్షల్లో ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఉండగా, జార్ఖండ్ సీఐడీ  జేపీఎస్‍సీ,  జేఎస్‌ఎస్‌సీ  ఉద్యోగ కుంభకోణాలలో తన పాత్ర ఉందన్న ఆరోపణలపై మాజీ  జేపీఎస్‍సీ ఛైర్మన్ ఎల్. ఖియాంగ్టేను అరెస్టు చేసింది. నియామక పరీక్షల అవకతవకలలో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సీఐడీ ఆయనను పలుమార్లు ప్రశ్నించింది. రాష్ట్ర నియామక పరీక్షల విధానంలో స్వతంత్ర విచారణ, సంస్కరణలు కోరుతూ రాంచీలో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ అభ్యర్థులు కొనసాగిస్తున్న నిరసనల మధ్య ఈ అరెస్టు జరిగింది. 

 
కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షలలో జరిగిన అవకతవకల ఆరోపణలకు సంబంధించి మాజీ జేపీఎస్సీ చీఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ మనోజ్ కౌశిక్ ధృవీకరించారు. “నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలకు సంబంధించి మేము మాజీ జేపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఎల్. ఖియాంగ్టేను అరెస్టు చేశాము,” అని అదనపు డైరెక్టర్ జనరల్ (సీఐడీ), మనోజ్ కౌశిక్ తెలిపారు.