రష్యా నుంచి భారత్‌కు పాక్ మీదుగా రైలు మార్గం!

రష్యా నుంచి భారత్‌కు పాక్ మీదుగా రైలు మార్గం!
సముద్ర వాణిజ్య మార్గాల్లో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ప్రత్యామ్నాయంగా రష్యా భూభాగ రవాణా మార్గాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్‌ను అభివృద్ధి చేసే అవకాశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రష్యా ఉప ప్రధాని మరాట్ ఖుస్నులిన్ ఈ ప్రతిపాదనను ప్రస్తావించారు. 
 
రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైల్వే లింక్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన సూచించారు. తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా ఈ రైల్వే మార్గాన్ని తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌కు చేరుకునే అవకాశం కల్పించే ఏ రూట్ అయినా తమకు పరిశీలనీయమేనని పేర్కొన్నారు. 
 
బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధులపై ఆధారపడే అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు భద్రతాపరమైన ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ఈ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
 
“హిందూ మహాసముద్రానికి రైలు మార్గాన్ని కూడా అన్వేషించాలి. బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ప్రమాదాల కారణంగా తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం కావచ్చు. భారతదేశానికి ప్రవేశం కల్పించే ఏ ఎంపిక అయినా ఆమోదయోగ్యమే,” అని రష్యా ఉప ప్రధాని మారత్ ఖుస్నుల్లిన్ టాస్ వార్తా సంస్థకు తెలిపారు.

ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో హర్మూజ్ జలసంధి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సముద్ర మార్గాల్లో అంతరాయాలు ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు అవసరమని రష్యా భావిస్తోంది. రష్యా ప్రతిపాదనల ప్రకారం సాధ్యమైన రైల్వే కారిడార్ తుర్క్‌మెనిస్తాన్ నుంచి ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా హిందూ మహాసముద్రంకు చేరేలా ఉండనుంది. 
 
ఈ మార్గం పూర్తిగా అమలులోకి వస్తే రష్యాకు సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ తరహా భూభాగ రవాణా మార్గం ఉపయోగపడే అవకాశం ఉందని రష్యా భావిస్తోంది. అయితే ప్రతిపాదిత మార్గంలో ఉన్న దేశాల భౌగోళిక, భద్రతా, రాజకీయ పరిస్థితులు, మౌలిక వసతులు వంటి అనేక అంశాలు ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను ప్రభావితం చేయనున్నాయి.

రష్యా చేస్తున్న ప్రతిపాదనలో భారత్‌కు అనుసంధానం కల్పించే మార్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తోంది. భారత్‌కు చేరుకునే అవకాశం ఉన్న ఏ రూట్ అయినా పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఉప ప్రధాని పేర్కొనడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. ఇలాంటి రైల్వే కారిడార్ అందుబాటులోకి వస్తే రష్యా-భారత్ మధ్య సరుకు రవాణాకు కొత్త మార్గం ఏర్పడే అవకాశం ఉంటుంది. 

 
అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. మార్గం ఖరారు, నిర్మాణ వ్యయం, దేశాల మధ్య ఒప్పందాలు, భద్రతా అంశాలు వంటి అనేక దశలను దాటాల్సి ఉంటుంది. ఇది కార్యరూపం దాలిస్తే భవిష్యత్తులో రెండు దేశాల వాణిజ్య సంబంధాలకు ఇది కీలకమైన కొత్త మార్గంగా మారే అవకాశం ఉంది.