వివేకా హత్య సమాచారం ఎవరెవరికి ఏ సమయంలో ఎలా చేరిందన్న అంశం పూర్తిగా వెలికితీసేలా సీబీఐని ఆదేశించాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు.‘‘వివేకా హత్యకు సంబంధించి కొన్ని అంశాలపై దర్యాప్తు అవసరమని సీబీఐ స్వయంగా కోర్టుకు చెప్పింది. మరోవైపు, స్పష్టత లేని కొన్ని విషయాలపై(గ్రే ఏరియా) పూర్తిగా దర్యాప్తు చేయలేదని ట్రయల్ కోర్టు పేర్కొంది” అని ఆమె గుర్తు చేశారు. ‘‘కేసు రికార్డుల్లో ఉన్న సాక్షుల వాంగ్మూలాల మధ్య కొన్ని వైరుధ్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. కొన్ని గ్రే ఏరియాలు పూర్తిస్థాయిలో దర్యాప్తు కాలేదనీ తెలిపింది. ఈ మేరకు గత నెల జూలై 24న కోర్టు స్పష్టం చేసింది. నా తండ్రి ఆత్మ ఏడేళ్లుగా క్షోభిస్తోంది. అంతిమంగా న్యాయం జరగాలనే నేను పోరాటం చేస్తున్నా.’’ అని సునీత తన లేఖలో పేర్కొన్నారు.
శనివారం వివేకా 75వ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా పులివెందులలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నివాళులు అర్పించారు. ‘ఆ వార్త అందరికీ ఉదయం 6.15 గంటలకు తెలిసింది. అంతకంటే ముందే జగన్కు ఎలా తెలిసిందనే విషయాన్ని బయటకు తేవాలని ఆమె కోరాను. తన తండ్రి హత్య విషయం అందరి కన్నా ముందుగా జగన్కు ఎలా తెలిసిందనే అనుమానాన్ని రాష్ట్రపతికి రాసిన లేఖలో సునీత లేవనెత్తారు.
‘‘ఆయన మరణం ఎప్పుడు ఎవరి నుంచి ఎలా బయటికి వెళ్లిందనే విషయం ఏడేళ్లుగా నన్ను కలచి వేస్తోంది. 2023, మే 25న తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో వివేకా మరణ వార్త 2019, మార్చి 15 వేకువజామునే జగన్కు తెలిసిందనడం వెనుక నిజాలు బయటికి రావాలి” అని ఆమె స్పష్టం చేశారు.
“బాహ్య ప్రపంచానికి తెలియక ముందే వైసీపీ అధ్యక్షుడికి ఎలా తెలిసిందో వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వివేకా హత్య కేసుకు సంబంధించి 2019-24 మధ్య ఆరుగురు చనిపోయారు. అందరివీ సహజ మరణాలే అంటున్నా ఒకే తరహాలో చనిపోవడం సందేహాలకు తావిస్తోంది. కేసు విచారణ కీలక దశకు చేరుకొంటున్న సమయంలో ప్రధాన సాక్షులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు మరణిస్తుండటంపై అనుమానం వ్యక్తమవుతోంది.’’ అని సునీత తన లేఖలో పేర్కొన్నారు.

More Stories
`జెన్ జెడ్’ తప్పు దోవపట్టించే ప్రయత్నాలతో రాజీనామా చేశా!
పరీక్షలలో అక్రమాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం 158 సీబీఐ కేసులు సిద్ధం
విలువల పరిరక్షణకు మహాయజ్ఞం `శ్రీవాణి’ పత్రిక