చైనా ఇటీవల ప్రతిపాదించిన భారీ డ్యామ్ ప్రాజెక్టు నేపథ్యంలో దిగువన ఉన్న దేశాలతో పారదర్శకత వహించాలని, వారితో సంప్రదింపులు జరపాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. నదుల దిగువన ఉన్న దేశంగా భారత్‌కు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని, ఎగువ ప్రాంతాల్లో చైనా చేపడుతున్న కార్యకలాపాల వల్ల దిగువ ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని బీజింగ్ అధికారులకు భారత్ పదే పదే విజ్ఞప్తి చేస్తోంది.
నదీ జలాలకు సంబంధించిన డేటాను తిరిగి అందించాలని, సహకారాన్ని కొనసాగించాలని భారత్ మరోసారి నొక్కి చెప్పింది. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదంపై మరో దఫా దౌత్యపరమైన చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసి) వెంబడి ఉన్న పరిస్థితులపై ఇరుదేశాలు లోతుగా సమీక్షించిన సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతలను నెలకొల్పడం ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని భారత్ స్పష్టం చేసింది.
అలాగే, సరిహద్దు దాటే నదులపై 2006లో ఏర్పాటు చేసిన నిపుణుల స్థాయి యంత్రాంగం తదుపరి సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించాలని, ఎగువ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల సాంకేతిక వివరాలను పంచుకోవడం కీలకమని భారత్ పునరుద్ఘాటించింది. భారత్-చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు, సమన్వయ వర్కింగ్ మెకానిజం 36వ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించింది.
ఎల్ఏసీ వెంట మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా దౌత్య, సైనిక మార్గాలను ఉపయోగించాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. గతేడాది జరిగిన 24వ ప్రత్యేక ప్రతినిధుల చర్చల కొనసాగింపుగ సరిహద్దుల గుర్తింపు, సరిహద్దు నిర్వహణ, వ్యవస్థల ఏర్పాటు, సరిహద్దుల మధ్య సహకారంపై ఇరుదేశాలు వివరంగా చర్చించాయి.
సరిహద్దుల గుర్తింపులో ప్రాథమిక పురోగతి సాధించడానికి డబ్ల్యూఎమ్‌సీసీ కింద ఒక నిపుణుల సమూహాన్ని ఏర్పాటు చేయడానికి గతంలో అంగీకరించారు. సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు సమర్థవంతమైన నిర్వహణను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలు సంకల్పించాయి. ఇదిలా ఉండగా, భారత్, చైనా మధ్య 36 వ విడత దౌత్య చర్చలపై కేంద్రం స్పందిస్తూ అన్ని అంశాలపై స్పష్టంగా చర్చించినట్టు తెలిపంది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితిపై సమీక్ష జరిగిందని పేర్కొంది.
భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీ (తూర్పు ఆసియా) సుజిత్ ఘోష్ నేతృత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ హౌ యాంకి నేతృత్వం వహించారు.

More Stories
కేంద్ర బిల్లులకు శిరోమణి అకాలీదళ్ మద్దతు
హనీట్రాప్‌లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్
జెన్ జెడ్ జీవితాలు, నిర్ణయాలు `వికసిత భారత్’లో కీలక పాత్ర