కేంద్ర బిల్లులకు శిరోమణి అకాలీదళ్ మద్దతు

కేంద్ర బిల్లులకు శిరోమణి అకాలీదళ్ మద్దతు

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో పెట్టాలని ప్రయత్నిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుతోపాటు, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇచ్చేందుకు పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ సిద్ధమైంది. మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్నామని శనివారం అధికారికంగా ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని సుమండీ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. 

శనివారం పార్టీ అగ్రనేతలతో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతకుముందు శుక్రవారం ఆయన ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించారు. మహిళా సాధికారతకు, గౌరవానికి సంబంధించి సిక్కు గురువులు నేర్పిన పాఠాలు తమకు స్ఫూర్తి అని ఆ పార్టీ ప్రకటించింది. 

ఇదే సమయంలో డీలిమిటేషన్ బిల్లుకు కూడా మద్దతు తెలిపింది. అయితే, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఉండేలా నియోజకవర్గాల విభజన జరగాలని కోరింది. డీలిమిటేషన్ బిల్లు ద్వారా ప్రస్తుతం అన్ని సభల్లో ఉన్న ప్రజాప్రతినిధుల శాతాన్ని అదనంగా 50 శాతం పెంచనుంది. ఈ నేపథ్యంలో వెంటనే డీలిమిటేషన్‌తోపాటు, మహిళా బిల్లు అమలు జరగాలని శిరోమణి అకాలిదళ్ కోరుతోంది.

శిరోమణి అకాలీదళ్ నాయకుడు దల్జీత్ సింగ్ చీమా ఇలా పేర్కొన్నారు: “మేము నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకం కాదు. జనాభా నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే కొంతకాలం పాటు మా ఆందోళనగా ఉండేది. అందరికీ 50 శాతం సీట్లు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రి చేశారు. ఆ విధానం సరైనదేనని అంగీకరించిన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన,  మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు దీనికి కూడా మేము సమ్మతించాము.”

ప్రధాని మోదీని సుఖ్ బీర్ ఢిల్లీలో కలవడం, అనంతరం ఈ ప్రకటన రావడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలిదళ్ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా ఈ పార్టీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. ఇదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న రెండు కీలక బిల్లులకు ఈ పార్టీ మద్దతు ఇవ్వడం ఎన్‌డీయే ప్రభుత్వానికి బలంగా మారనుంది.