‘అభివృద్ధికి ఓటు పడుతుంది అనుకుంటే పొరపాటే.. మానవ సంబంధాలకు ఓటు పడుతుంది’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత అనుభవాన్ని చెప్పుకొచ్చారు. తన అనుభవంతో చెబుతున్నానని పేర్కొంటూ అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఒక గ్రామానికి సంబంధించి తనకు ఎదురైన అనుభవాన్ని అభివృద్ధికి, ఓటుకు సంబంధం లేదని స్పష్టం చేస్తుందని ఆయన వివరించారు.
పీలేరు నియోజకవర్గంలోని మంచాలమంద అని రిమోట్ ఏరియా ఉందని, అక్కడ 9 కిలోమీటర్లు రోడ్డు లేదని చెప్పారు. తాను 1989లో ఎమ్మెల్యే అయినా 2002 వరకు ఆ గ్రామానికి పోలేదని, 9 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ ఊరిలో 800 నుంచి 900 ఓట్లు ఉన్నాయని, తన తమ్ముడు, ఆ పక్కనే ఉండే తమ బంధువులు ఆ గ్రామానికి సంబంధించిన విషయాలను చూసుకునేవాళ్లని చెప్పకొచ్చారు.
“ఆ ఊరిలో ఎవరికీ ఇల్లు సరిగా లేదు, రోడ్డు లేదు, ఇరిగేషన్ సౌకర్యాలు కూడా లేవు. ఇదంతా చూసి 2004లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకుని అందరికి ఇళ్లు కట్టించాము. 500 ఇళ్లు ఆ ఒక్క గ్రామానికి ఇచ్చాము. ఎంపీపీ పదవి కూడా ఆ గ్రామానికి చెందిన వారికే ఇచ్చాము. అలాగే 4వేల ఎకరాలకు నీళ్లు వచ్చేలా రెండు చెక్‌డ్యామ్‌లు కట్టించాము. రూ.కోటితో ఆ ఊరికి రోడ్డు వేయించాము. ఆ ఊరికి రోడ్డు వచ్చింది, బస్సు వచ్చింది, ఇళ్లు వచ్చాయి, పొలాలకు నీళ్లు వచ్చాయి. కానీ ఆ ఊరిలో ముందు ఎన్నికల్లో 300 ఓట్లు వస్తే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 30 ఓట్లు మెజార్టీ వచ్చింది” అని వివరించారు.
“ఇలా ఎందుకు జరుగుతుందని విశ్లేషణ చేశాము. ఆ ఊరికి చెందిన వారిలో నాతో ఉన్న కొందరు నేతలు డబ్బులు సంపాదించుకున్నారు. ఆ నేతలపై అసూయతో, ఆ ఊరిలో మెజార్టీ వస్తే ఆ నేతలకు పేరు వస్తుంది. తాము ఎందుకు ఓటు వెయ్యాలని జనాలు నన్ను వ్యతిరేకించారు. రాజకీయం అనేది చాలా కష్టమైన విషయం. ఫార్ములా ఏమీ ఉండదు. ఇది చేస్తే మనం గెలుస్తాం, ఇది చేస్తే మనం ఓడిపోతామనే ఫార్ములా ఉండదు. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే గెలుస్తాము. లేదంటే ఓడిపోతాము. ఇక్కడ భగవంతుడు ఓటరు మహాశయులు తలచుకుంటే గెలుస్తాము. వాళ్లు తలచుకోకపోతే ఓడిపోతాము’ అని తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు.
More Stories
గుజరాత్లో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్
పింగళి వెంకయ్యకు మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ నివాళులు
`వికసిత్ భారత్’ కు ఒక కీలక వృద్ధి చోదకంగా ఆంధ్రప్రదేశ్