వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గతంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ మళ్లీ ఒక్కటయ్యే అవకాశం ఉందా? శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడి) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మధ్య జరిగిన సమావేశం, ఈ పాత పొత్తు పునరుద్ధరణపై చర్చలకు దారితీసింది.
న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో బాదల్ ప్రధాన మంత్రిని కలిశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పొత్తుకు సంబంధించిన చర్చలు ఈ సమావేశ అజెండాలో భాగంగా ఉన్నాయి. వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల నేపథ్యంలో 2020లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ మధ్య దాదాపు రెండున్నర దశాబ్దాల నాటి పొత్తు తెగిపోయింది.
ఆ సమయంలో, ఎన్డీయే నుండి వైదొలుగుతున్నట్లు అకాలీ దళ్ ప్రకటించింది. అప్పటి నుండి, రెండు పార్టీలు 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలలో విడివిడిగా పోటీ చేశాయి. 1999 నుండి ఆ రెండు పార్టీలు కలిసి ఆరు లోక్‌సభ ఎన్నికలలో కలిసి పోటీచేశాయి. కానీ, 2022 పంజాబ్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన అకాలీ దళ్ అత్యంత దారుణమైన ఫలితాలను చవిచూసి, కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. మరోవైపు, బీజేపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
అయితే, ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్న 2017 పంజాబ్ ఎన్నికల్లో, అకాలీ దళ్ 15 స్థానాలను, బీజేపీ మూడు నియోజకవర్గాలను గెలుచుకున్నాయి. కానీ ఇటీవల, ఈ పార్టీలు మళ్లీ జతకట్టవచ్చనే వార్తలు వస్తూనే ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వీరి మధ్య పొత్తు కుదురుతుందనే ఊహాగానాలు కూడా బలంగా వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో అకాలీ దళ్ కేవలం ఒక స్థానాన్ని గెలుచుకోగా, బీజేపీ ఆ రాష్ట్రంలో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. జూలైలో జలంధర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ ఆప్, కాంగ్రెస్, అకాలీ దళ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ప్రధాని తన పార్టీకి వ్యతిరేకంగా కాకుండా అకాలీ దళ్‌లోని మరొక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడారని బాదల్ సమర్థించుకున్నారు.
ఈ పరిణామం, పాత మిత్రపక్షాలైన ఆ పార్టీలు మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయా అనే చర్చకు దారితీసింది. బాదల్ ప్రకారం, ప్రధాని మోదీ అకాలీ దళ్ నుండి విడిపోయిన వర్గమైన ‘ఎస్ఏడి (పునర్ సుర్జిత్)’కు వ్యతిరేకంగా మాట్లాడారు. కాగా, విడిపోయినప్పటికీ, రెండు పార్టీల సీనియర్ నాయకుల మధ్య అప్పుడప్పుడు జరుగుతున్న సమావేశాలు పొత్తు పునరుద్ధరణకు సంబంధించిన ఊహాగానాలను సజీవంగా ఉంచాయి.
బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ మధ్య భవిష్యత్తు సంబంధాలకు సంబంధించి ఏవైనా రాజకీయ సంకేతాలు వెలువడతాయేమోనని శుక్రవారం నాటి సమావేశంపై అందరి దృష్టి ఆకర్షించింది. పొత్తును పునరుద్ధరించడానికి అకాలీ దళ్, రాష్ట్ర బీజేపీ విభాగం అనుకూలంగా ఉన్నాయని స్నెక్తాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన నాయకులు కూడా పొత్తు పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నారని, అయితే తుది నిర్ణయం బీజేపీ కేంద్ర నాయకత్వం చేతిలోనే ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది మార్చిలో మోగాలో పర్యటించినప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అకాలీ దళ్‌తో పొత్తును ఖచ్చితంగా తోసిపుచ్చారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉండగా, గ్రామీణ పంజాబ్‌లో అకాలీ దళ్‌కు మంచి ప్రభావం ఉంది కాబట్టి, పొత్తు వల్ల రెండు పార్టీలకు ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల పంజాబ్ పర్యటనలో, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ, పొత్తుకు సంబంధించిన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాన ప్రాతిపదికన పొత్తును పునరుద్ధరించాలని బీజేపీ కోరుకుంటోందని తెలుస్తున్నది. గతంలో ఈ కూటమిలో బీజేపీ చిన్న భాగస్వామిగా వ్యవహరించేది, అకాలీ దళ్ ఎప్పుడూ పైచేయి కలిగి ఉండేది.
ఈ కూటమిలో బీజేపీ ఇకపై ‘తమ్ముడి’ (జూనియర్ భాగస్వామి) పాత్రను పోషించదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, సీట్ల పంపకం వంటి అంశాలను తర్వాత చర్చించుకోవచ్చని, పంజాబ్‌లో పరిస్థితులను మెరుగుపరచడమే ప్రస్తుత ప్రాధాన్యత అని అకాలీ నేతలు భావిస్తున్నారు.
సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో భద్రతా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇది జాతీయ భద్రతకు సవాలుగా మారవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని, బాదల్ మధ్య జరిగిన భేటీని వెంటనే గమనించి, వీరిద్దరి మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. “ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసి పనిచేయబోతున్నాయా?” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.
2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నారు. పంజాబ్‌లో ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధమవుతోందని బీజేపీ నేతలు పదేపదే స్పష్టం చేశారు. అయితే, సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రధాని మోదీతో సమావేశం కావడం, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మాజీ మిత్రపక్షాలు తమ పొత్తును పునరుద్ధరించుకునే అవకాశాన్ని పరిశీలించవచ్చనే ఊహాగానాలకు మళ్లీ ఆజ్యం పోసింది.

More Stories
అరుణాచల్‌లోని 27 ప్రదేశాలను చైనా పేర్లను తిప్పికొట్టిన భారత్
పాకిస్తాన్, సౌదీ, టర్కీల కీలక రక్షణ ఒప్పందం
జార్ఖండ్ నిరాహారదీక్షలో ఒకరు ఆసుపత్రికి .. చర్చలకు సీఎం ఆహ్వానం