గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవం

గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు గొప్ప, వైవిధ్యభరితమైన చేనేత వారసత్వాన్ని ప్రదర్శించడం ద్వారా, సోషల్ మీడియాలో స్వదేశీ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో, భారతదేశపు సాంప్రదాయ నేత వారసత్వాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, “గెట్ రెడీ విత్ మీ” వీడియోలతో సహా, తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను పంచుకోవాలని ప్రధానమంత్రి పౌరులను ప్రోత్సహించారు. 
 
“రఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం. భారతదేశపు చేనేత వైవిధ్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువద్దాం. మీకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన మీ వీడియోలను, జి ఆర్ డబ్ల్యు ఎం వీడియోలతో సహా, సోషల్ మీడియాలో పంచుకోండి. #NationalHandloomDay అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించడం మర్చిపోవద్దు,” అని ప్రధానమంత్రి కోరారు. 
 
భారతదేశపు శతాబ్దాల నాటి చేనేత సంప్రదాయాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం, బలోపేతం చేయడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, దేశ సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి నేత కార్మికుల సంఘం అందిస్తున్న అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తూ, ఆగష్టు 7న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ విజ్ఞప్తి వెలువడింది. 
 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా ఈ వేడుకలకు హాజరై, ప్రతిష్టాత్మకమైన సంత్ కబీర్ చేనేత అవార్డులు, జాతీయ చేనేత అవార్డులు 2025ను ప్రదానం చేస్తారు.  
ఈ కార్యక్రమంలో ఒక ప్రధాన ఆకర్షణగా, చేనేత రంగంతో అనుబంధం ఉన్న నేతపని, ఆవిష్కరణ, డిజైన్ అభివృద్ధి, మార్కెటింగ్ కార్యక్రమాలు, స్టార్టప్ సంస్థలు, ఉత్పత్తిదారుల కంపెనీలలోని శ్రేష్ఠతను గుర్తించే మూడు సంత్ కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో సహా 22 జాతీయ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
 
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం చేనేత మార్కెటింగ్ సహాయ విభాగం కింద ఏర్పాటు చేసినఈ అవార్డులు, భారతదేశ చేనేత పర్యావరణ వ్యవస్థలో శ్రేష్ఠతకు ఇచ్చే అత్యున్నత జాతీయ గుర్తింపును సూచిస్తాయి. సంత్ కబీర్ చేనేత పురస్కారం భారతదేశ నేత సంప్రదాయాలను పరిరక్షించడంలో కనబరిచిన అసాధారణమైన హస్తకళా నైపుణ్యాన్ని, జీవితకాల అంకితభావాన్ని గౌరవిస్తుంది.
 
ఈ వేడుకలలో భాగంగా, భారతదేశపు విభిన్న చేనేత సంప్రదాయాలను ప్రదర్శించే నాలుగు స్మారక తపాలా బిళ్ళలను కూడా విడుదల చేస్తారు.  ‘ఎర్త్. రూట్. థ్రెడ్ – ఆల్ డైడ్ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా’, ‘హ్యాండ్లూమ్ అవార్డ్స్ బుక్ 2025’ అనే రెండు ప్రచురణలను ఆవిష్కరిస్తారు.