ప్రాంతీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల నుండి  రూ. 872.538 కోట్ల విరాళాలు 

ప్రాంతీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల నుండి  రూ. 872.538 కోట్ల విరాళాలు 
భారతదేశంలో రాజకీయ నిధుల సమీకరణలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. ఎన్నికల సంఘానికి తమ ఆర్థిక వివరాలను సమర్పించిన 40 ప్రాంతీయ పార్టీలకు అందిన విరాళాలలో అత్యధిక భాగం వ్యాపార సంస్థల నుండే వచ్చినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడిఆర్) నిర్వహించిన విశ్లేషణ ప్రకారం, ఈ 40 ప్రాంతీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాలలో కార్పొరేట్ సంస్థల వాటా రూ. 872.538 కోట్లు (62.36%)గా ఉంది. 
 
మరోవైపు, వ్యక్తిగత దాతలు మొత్తం విరాళాల సంఖ్యలో దాదాపు 69% వాటాను కలిగి ఉన్నప్పటికీ, వారి నుండి వచ్చిన విరాళాల విలువ రూ. 193.946 కోట్లు (13.86%) మాత్రమే. ఏడిఆర్ రూపొందించిన ఈ నివేదిక, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలలో ప్రాంతీయ రాజకీయ పార్టీలు భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) సమర్పించిన విరాళాల వివరాలపై దృష్టి సారించింది. 
 
ఈ రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలు ఈసిఐకు ప్రకటించిన రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన విరాళాలను ఈ నివేదిక విశ్లేషిస్తుంది. ఇందులో అందిన విరాళాల పరిమాణం, విలువపై తులనాత్మక పరిశీలన, అత్యధిక విరాళాలు పొందిన పార్టీల గుర్తింపు, ప్రధాన దాతల వివరాల పరిశీలనతో పాటు రంగాల వారీగా, విరాళం అందించిన విధానం, రాష్ట్రాల వారీగా పంపిణీ, దాతల పాన్ వివరాల లభ్యత వంటి అంశాల విశ్లేషణ ఉన్నాయి. 
 
తమ నిధుల వివరాలను వెల్లడించిన భారతదేశంలోని 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలలో 40 పార్టీలకు అందిన విరాళాలపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ నేతృ. త్వంలోని డీఎంకే అత్యధిక విరాళాలను (రూ. 20,000 పైన) ప్రకటించింది; 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి 467 విరాళాల ద్వారా రూ. 365.784 కోట్లు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, టీడీపీ అత్యధికంగా రూ. 100.1889 కోట్ల విరాళాలను (172 విరాళాల ద్వారా) ప్రకటించింది. 
 
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటియుసి), డీఎంకే తర్వాత అత్యధికంగా రూ. 184.96 కోట్ల విరాళాలను ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ. 140 కోట్లతో వైఎస్సార్‌సీపీ, రూ. 83 కోట్లతో టీడీపీ నిలిచాయి. అత్యధిక విరాళాలు పొందిన మొదటి 10 పార్టీల జాబితాలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలలో ఏఐఏడిఎంకె (రూ. 66 కోట్లు), బిజెడి (రూ. 60 కోట్లు), జెఎంఎం (రూ. 33 కోట్లు), జనసేన (రూ. 25 కోట్లు), జెడియు (రూ. 18 కోట్లు), ఐయుఎంఎల్ (రూ. 15 కోట్లు) ఉన్నాయి. 
 
ఈ రెండు ఆర్థిక సంవత్సరాల మధ్య అనేక పార్టీలు విరాళాల విషయంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. వీటిలో డీఎంకే, ఏఐటియుసి, జెఎంఎం, ఏఐఏడిఎంకె, ఎల్జేపీ (రామ్ విలాస్), జేడీయు, బిజెడి వంటి పార్టీలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2023-24, 2024-25 మధ్య విరాళాలలో తగ్గుదల నమోదైన పార్టీలలో బిఆర్ఎస్, టిడిపి, జనసేన పార్టీ, సిపిఐ,  జననాయక్ పార్టీ, జెడిఎస్, ఎంఎన్ఎస్  ఉన్నాయి. 
 
మొత్తంగా చూస్తే, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రకటించిన రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన విరాళాల సంఖ్య 85% పెరిగింది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,861గా ఉన్న విరాళాల సంఖ్య, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,297కి చేరింది. ప్రకటించిన విరాళాల మొత్తం విలువ కూడా మూడు రెట్లు పెరిగింది—2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 347.693 కోట్లుగా ఉన్న ఈ విలువ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,051.556 కోట్లకు చేరింది. ఇది ప్రాంతీయ పార్టీలకు లభించిన ఆర్థిక విరాళాలలో భారీ పెరుగుదలను సూచిస్తోంది.