ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి జరిగింది. మంగళవారం యెమెన్‌ జలాల సమీపంలో జరిగిన ఈ దాడిలో ఎమ్ఎస్‌వీ ఫైజ్‌ నూరే ఓలియా షిప్‌ నీట మునిగింది. దాడి జరిగిన సమయంలో నౌకలో 14 మంది సిబ్బంది ఉన్నారు. యెమెన్‌ తీర ప్రాంత రక్షక దళం హుటాహుటిన రంగంలోకి దిగింది. నౌకలో ఉన్న 13 మంది భారతీయ సిబ్బంది సహా ఓ యెమెన్ వ్యక్తిని ప్రాణాలతో కాపాడింది. వారికి తక్షణ వైద్య సేవలు అందించింది.

యెమెన్ జలాల్లో భారత నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ దాడిపై ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ “భారతీయ నౌక ఎమ్ఎస్‌వీ ఫైజ్ నూరే ఒలియా యెమెన్ జలాల సమీపంలో క్షిపణి దాడికి గురైంది. దాడి కారణంగా ఆ నౌక తలకిందులై నీట మునిగిపోయింది. కారణం లేకుండా నౌకపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల భద్రతకే మా మొదటి ప్రాధాన్యత” అని స్పష్టం చేశారు. 

“సిబ్బందిలోని 14 మంది నావికులను యెమెన్ కోస్ట్ గార్డ్ రక్షించింది. వారిని పోర్టుకు తరలించింది. దాడి జరిగిన ప్రాంతంలో భారతీయ నావికుల సంపూర్ణ భద్రత కోసం క్షిపణి దాడిలో ప్రాణాలతో బయటపడ్డ సిబ్బందికి అవసరమైన సహాయం అందించడం కోసం అన్ని సంస్థలతో సమన్వయం చేసుకుంటూ తక్షణ చర్యలు చేపట్టాలని డైరెక్టర్ జనరల్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డిజిఎంఎ)ను ఆదేశించాను” అని రాసుకొచ్చారు.  

కాగా, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో, జూలై నెల ప్రారంభంలో నల్ల సముద్రంలో ఒక వాణిజ్య నౌకపై దాడి జరగడంతో ఒక భారతీయ నావికుడు మరణించాడు. రష్యా ప్రాదేశిక జలాల్లో ఉన్న ఆ నౌకను మార్షల్ దీవుల జెండా కలిగిన ఎంవి ఒమోర్ఫీగా గుర్తించారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చివరిసారిగా లంగరు వేసిన ఆ నౌకలో, ఈ ఘటన జరిగిన సమయంలో ముగ్గురు భారతీయులతో సహా పది మంది సిబ్బంది ఉన్నారు. 
 
నౌకలో ఉన్న మిగతా ఇద్దరు భారతీయులు క్షేమంగా ఉన్నారని కూడా ఆ సంస్థ తెలిపింది. మృతుని కుటుంబానికి సహాయం చేయడానికి రష్యాలోని భారత మిషన్ సంబంధిత అధికారులను సంప్రదించి, సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది.