* బుల్లెట్లు, బ్లాక్‌అవుట్‌లు, బెదిరింపులు, అణచివేతతో పాక్ స్పందనపై భారత్ మండిపాటు
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న స్థానిక ఎన్నికలు “పూర్తి ప్రహసనం” అని భారతదేశం మంగళవారం కొట్టిపారేసింది. ప్రజా నిరసనలు, పాకిస్తానీ బలగాలచే పౌరుల హత్యల వాస్తవాలను ఈ ఎన్నికలు కప్పిపుచ్చలేవని స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, విస్తృత ప్రజా అసంతృప్తికి పాకిస్తానీ ప్రభుత్వం “బుల్లెట్లు, బ్లాక్‌అవుట్‌లు, బెదిరింపులు, అణచివేత”తో స్పందించిందని, ఇప్పుడు ఈ డొల్ల ఎన్నికల ప్రక్రియ ద్వారా చట్టబద్ధతను సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
“పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న ఈ స్థానిక ఎన్నికలు పూర్తిగా ప్రహసనం. అసలు కథ ప్రజా నిరసనలు, పాకిస్తానీ బలగాలచే పౌరుల విచక్షణారహిత హత్యలే. ఇటువంటి డొల్ల చర్యలు వాస్తవాన్ని దాచలేవు,” అని జైస్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జరిగిన అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరెందరో గాయపడ్డారని ఆయన తెలిపారు. జవాబుదారీతనం ఉండాలని జైస్వాల్ పిలుపునిచ్చారు.
మానవ హక్కులపై పాకిస్తాన్ చేస్తున్న కపట ఉపన్యాసాలను అంతర్జాతీయ సమాజం గ్రహించాలని ఆయన కోరారు. ఆ ప్రాంతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పిఓజెకెలో పౌర జనాభాపై జరుగుతున్న క్రూరమైన అణచివేత నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికలు విస్తృత అంతరాయాలు, నిర్వహణాపరమైన వైఫల్యాలు మరియు కొనసాగుతున్న నిరసనలతో నిండిపోయాయి.
పిఓజేకే అంతటా, పాకిస్తాన్‌లోని పలు నగరాల్లోని కాశ్మీరీ వర్గాల మధ్య ప్రదర్శనలు జరిగాయి. వీటిలో కరాచీలో జరిగిన భారీ సమావేశాలలో నిరసనకారులు ఎన్నికల ప్రక్రియను విమర్శిస్తూ, రాజకీయ సంస్కరణలకు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనల సందర్భంగా పోలీసులు పలువురు నిరసనకారులను, విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారని వర్గాలు తెలిపాయి.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజే ఆసియా)తో సహా ప్రపంచ మానవ హక్కుల, పత్రికా స్వేచ్ఛ సంస్థలు, రావల్కోట్, పిఓజేకే అంతటా జరిగిన నిరసనలకు సంబంధించి పెరుగుతున్న ప్రభుత్వ హింస, పత్రికా ఆంక్షలు, మీడియా అణచివేతను ఖండిస్తూ అత్యవసర ప్రకటనలు జారీ చేశాయి. జర్నలిస్టుల బలవంతపు అదృశ్యాలు, విదేశీ మీడియా సంస్థలపై ఆంక్షలు, విస్తృత ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల నివేదికలపై ఈ బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
వారు అణచివేతను తక్షణమే నిలిపివేయాలని, ఆరోపించిన మానవ హక్కుల ఉల్లంఘనలపై పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రావల్కోట్‌లో ప్రదర్శనకారులపై బలప్రయోగం చేసినట్లు ఆందోళనకరమైన వివరాలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెలుగులోకి తెచ్చింది. ఇది ప్రభుత్వ నేతృత్వంలోని హింస ఒక పద్ధతిగా కొనసాగుతోందని సూచిస్తూ, స్వతంత్ర బాహ్య విచారణకు పిలుపునిచ్చింది.

More Stories
పీఓకె అణచివేతపై వార్తలిచ్చిన అల్ జజీరాపై పాక్ వేటు
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకుపైగా ప్రజలపై చైనా నిఘా
లాంఛనంగా భారత్ కు కామన్వెల్త్ క్రీడల పతాకం