ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని మాతంగి స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల (లష్కర్) ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. వావివరసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి, జీవన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఉత్సవాలు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరుగుతున్నాయి. ఆషాడ మాస లష్కర్ బోనాల జాతర సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. పసుపు, కుంకుమలు, వేపమండలతో అలంకరించిన బోనాలను మహిళలు తలపై ధరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
రెండో రోజైన సోమవారం అత్యంత పవిత్రమైన ‘రంగం’ కార్యక్రమం శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఉజ్జయిని అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని తనలోకి ఆవహించుకుని భవిష్యవాణి వినిపించారు. “నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాటిచ్చి ఇప్పటి నిలబెట్టుకోలేదు. అయినా ప్రజల్ని నేను కాపాడుతూనే ఉన్నా. ఏ ఆపద వచ్చినా. ప్రమాదం వచ్చినా కాపాడుతున్నా. అయినా నా మాట మీరు ఆచరించటం లేదు. ఇది నాకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఎవరు అడ్డుపుల్ల వేసినా నేను ఊరుకోను. ఈ ఏడాది కూడా కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. జనాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి” అని ఆమె హెచ్చరించారు.
ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని, జనాలు మాత్రం సగానికి సగం కొట్టుకుపోతునే ఉంటారని ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని చెబుతూ ప్రతి ఏడాది అది జరుగుతూ ఉంటదని, కానీ ఈ ఏడాది ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు.
“మీరు ఘోరాలు చేస్తుంటే ప్రమాదాలు, ప్రాణనష్టం జరుగుతూ ఉంటయ్. వాళ్లను నేను మాత్రం వదలిపెట్టను. ఈ ఏడాది బాధగా, ఇబ్బందిగా ఉంది. సంతోషం లేకుండా చేస్తున్నరు. మీకు అహంకారం ఎక్కువైపోతుంది. మీరు గాలికి వదిలేసిన పిల్లల్ని నేను కాపాడుతా. ఈ ఏడాది మాత్రం నన్ను నిరుత్సాహపరుస్తున్నారు. కంటతడి పెట్టిస్తున్నారు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు” అని ఆమె చెప్పుకొచ్చారు.
“నేను కోరింది ఒక్కటే. నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లయితే కోరిందల్లా ఇస్తా. ఈ ఆరు మాసాల లోపు విగ్రహ ప్రతిష్ఠ చేయికపోతే ప్రాణ నష్టం జరిపిస్తా. నాకు అడ్డు వచ్చిన వాళ్లను పాదాల కింద వేసి నలిపిస్తేంటా” అంటూ స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు.

More Stories
20 శాతం భర్తీకాని ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో సీట్లు
సొంత లాంచ్ ప్యాడ్ నిర్మించనున్న స్కైరూట్
మెటా ఇండియాపై కేసు.. రాజకీయ వత్తిడితో హైదరాబాద్ డీసీపీ బదిలీ!