తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వరుస వివాదాల నేపథ్యం లో హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అర్హత కలిగిన మరో అధికారిని నియామించాలని ఆదేశించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలో సర్వే నంబర్లు 1,2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీవ్రమైన ఈ ఆదేశాలు జారీ చేసింది.
లోతుకుంట భూముల వ్యవహారంపై జరిగిన విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేసి హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. కోర్టులు, దేశ న్యాయవ్యవస్థపై తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొన్నారు. లోతుకుంటలోని వివాదాస్పద 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని.. అక్కడ ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. పిటిషనర్ వాస్తవాలను వక్రీకరించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కూడా అఫిడవిట్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరోపించారు.
అయితే ఈ వివరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండడాన్ని తీవ్రంగా పరిగణించింది. సెక్రటరీ హోదాలో ఉన్న ఒక ఉన్నతాధికారి కోర్టు ఆదేశాలను ఇన్నిసార్లు ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇన్ని ఉల్లంఘలనకు పాల్పడుతున్న అధికారిని ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా అదుపు తప్పుతుందని పేర్కొంటూ రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలిపింది.
కాగా, గతంలోను హైకోర్టు రంగనాథ్‌ను పద్ధతి మార్చుకోవాలని పలు మార్లు హెచ్చరించింది. ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేమిటని నిలదీసింది.
ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా? కోర్టు ధికరణనే పరిపాటిగా మార్చుకున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే అంశంపై మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలే చెప్తున్నాయని పేర్కొంది. ఇకడ బాధితుడు పిటిషనర్ కాదని, స్వయంగా కోర్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధికరించడం ఎంతమాత్రం సహించబోమని రంగనాథ్‌కు తేల్చిచెప్పింది. ప్రభుత్వమైనా, ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది.
నీటి వనరులు, నాలాలు, కాలువల పరిరక్షణ పేరుతో కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి ప్రైవేటు భూముల్లోకి వెళ్లడం ఏ చట్టం ప్రకారం సమర్థనీయమని ప్రశ్నించింది. యజమాని అనుమతి లేకుండా ప్రైవేటు భూమిలో అడుగు పెట్టరాదన్న ప్రాథమిక సూత్రం తెలియదా? అని నిలదీసింది. ప్రభుత్వ భూమిని రక్షించడమే లక్ష్యమైతే ప్రైవేటు వ్యక్తిపై పోలీసు ఫిర్యాదు ఎందుకు చేశారని ప్రశ్నించింది.

More Stories
విపక్షాల నినాదాల గందరగోళం మధ్య లోక్‌సభలో `లీకేజీ’పై బిల్లు
భారత్ బలోపేతానికి ఆర్థిక స్వావలంబన అవసరం
మాతృత్వంలోని ప్రేరణను, సందేశాన్ని మరచిపోవడంతోనే అధోగతి