* వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్ ఆతిథ్య జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం హరారే వేదికగా జరిగిన ఆఖరి పోరులో టీమిండియా 35 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. వైభవ్ సూర్యవంశీ (49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) ఈ సిరీస్‌లో రెండో అర్ధ శతకంతో మెరిసిన వేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది.
ఇషాన్ కిషన్ (29), సారథి శ్రేయస్ అయ్యర్ (27), రింకూ సింగ్ (25) రాణించారు. ఛేదనలో జింబాబ్వే.. పూర్తి ఓవర్లు ఆడినా 157/7 వద్దే ఆగిపోయింది. ర్యాన్ బర్ల్ (43 బంతుల్లో 5 ఫోర్లతో 54), వెస్లీ మెధెవెరె (28) ఆ జట్టు గెలుపు కోసం ఆఖరిదాకా పోరాడారు. వైభవ్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు లభించాయి.
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అభిషేక్ (2) నిరాశపరిచినా వండర్ కిడ్ వైభవ్ మాత్రం మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పవర్ ప్లేలో తనదైన శైలిలో విజృంభించిన అతడు. తర్వాత నెమ్మదించి, అర్ధ శతకం తర్వాత మరోసారి రెచ్చిపోయి పర్యాటక జట్టు భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో బాదుడుకు శ్రీకారం చుట్టిన ఈ బీహార్ చిన్నోడు ఇషాన్‌తో జతకలిశాక ధాటిగా ఆడాడు.
ముజరబాని నాలుగో ఓవర్లో అతడు 6, 4 దంచగా ఎవాన్స్ బౌలింగ్‌లో ఇషాన్ రెండు ఫోర్లు కొట్టాడు. పవర్ ప్లేను 64/1తో ముగించిన ఈ ద్వయం ఆ తర్వాత దూకుడు తగ్గించింది. వైభవ్, ఇషాన్ క్రీజులో ఉన్నా 8-12 ఓవర్ల మధ్య 23 పరుగులు మాత్రమే వచ్చాయి. 31 బంతుల్లో వైభవ్ ఫిఫ్టీ పూర్తయింది. కానీ సికందర్ 11వ ఓవర్లో ఇషాన్‌ను బౌల్డ్ చేసి 75 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.
ఇషాన్ నిష్క్రమించినా కెప్టెన్ రాకతో సూర్యవంశీ మళ్లీ గేర్ మార్చాడు. మధెవెరె ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టిన అతడు.. రజా 13వ ఓవర్లో ముందుకొచ్చి 102 మీటర్ల సిక్స్ దంచాడు. మధెవెరెనే వేసిన 15వ ఓవర్లో సిక్స్ కొట్టిన అతడు.. ఆఖరి బంతికి ఎవాన్స్ క్యాచ్ పట్టడంతో 50 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖర్లో శ్రేయస్ (27) నిష్క్రమించినా రింకూ సింగ్ (25) మెరుపులతో ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

More Stories
దేశానికి తొలి స్వర్ణం అందించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి
చైనాలో నౌల్ తుఫాను బీభత్సంతో రెడ్ అలర్ట్
జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం