చైనాలో నౌల్ తుఫాను బీభ‌త్సంతో రెడ్ అల‌ర్ట్

చైనాలో నౌల్ తుఫాను బీభ‌త్సంతో రెడ్ అల‌ర్ట్
చైనాలోని దక్షిణ గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున నౌల్ తుఫాను తీరాన్ని తాకడంతో, వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో పది మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం డింగ్సీ నగరంలోని వీయువాన్ కౌంటీలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన ఆకస్మిక వరద, ఒక సుందరమైన ప్రాంతాన్ని ముంచెత్తిందని, దీనివల్ల 10 మంది మరణించగా, 23 మంది గాయపడ్డారని ప్రభుత్వ ఆధీనంలోని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 
 
ఆ సుందరమైన ప్రాంతంలో క్యాంపింగ్ చేస్తున్న కొంతమంది పర్యాటకులు, వరద విరుచుకుపడటంతో చిక్కుకుపోయారని స్థానిక అధికారులు తెలిపారు. జాతీయ సమగ్ర అగ్నిమాప, సహాయక బృందాలకు చెందిన మొత్తం 305 మంది సహాయక సిబ్బంది, 68 వాహనాలతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. 
 
ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా నేషనల్ రేడియో ప్రకారం, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజాము నాటికి 7,15,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శనివారం నాటికి సుమారు 3,40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ నౌల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.
ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంవల్ల దక్షిణ చైనాలో తీవ్ర స్థాయిలో గాలులు, భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌  లో మూడు లక్షలకుపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. శనివారం 410కి పైగా విమానాలు 150 హై-స్పీడ్ రైలు సర్వీసులను రద్దు చేశారు. దాంతో వేలమంది ప్రయాణికులపై ప్రభావం పడింది. పొరుగున ఉన్న హాంకాంగ్‌పైనా ఇది విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తోంది.
ఈ తుఫాను గంటకు సుమారు 145 కిలోమీటర్ల (90 మైళ్ల) గరిష్ట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ఫలితంగా పెద్దఎత్తున చెట్లు కూలిపోయాయి. గ్వాంగ్‌డాంగ్ తీరాన్ని తాకడానికి ముందు ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకిన తర్వాత ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి క్రమంగా బలహీనపడుతుందని పేర్కొన్న‌ది. దాంతో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

దేశ రాజధాని బీజింగ్‌తో సహా అనేక ప్రధాన నగరాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి 28 అత్యవసర సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను కారణంగా తూర్పు తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.