* ఎన్టీఏలో శాశ్వత సిబ్బంది 24 మందే!
నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాల నిరసనలతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో భారీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ సూచనల మేరకు పలు మార్పులు చేపట్టనున్నారు.
ఎన్టీఏ అవుట్‌సోర్సింగ్ పద్ధతులను సవరించడం కీలక మార్పులలో ఒకటని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే నీట్ లీక్ నేపథ్యంలో ఎన్టీఏ నుంచి కనీసం 47 మంది అధికారులను తొలగించారని ఆ వర్గాలు వెల్లడించాయి. మరికొందరిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వినీత్ జోషిని పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.
“ ఎన్టీఏలో సమూల మార్పులు జరగబోతున్నాయి. మరిన్ని సంస్కరణాత్మక చర్యలు తీసుకోబడతాయి. కనీసం 47 మంది అధికారులను తొలగించారు, వారిలో కొందరిపై చట్టపరమైన, క్రిమినల్ చర్యలు ప్రారంభించబడతాయి” అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీ మరియు సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంలో తలెత్తిన సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆగ్రహం కారణంగా, ఉన్నతాధికారుల బదిలీల పరంపర మొదలైంది.
భవిష్యత్తులో మరిన్ని “సంస్కరణాత్మక చర్యలు” ఉంటాయని, అలాగే అవుట్‌సోర్సింగ్ విధానాన్ని కూడా ప్రక్షాళన చేస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నీట్ (యుజి), నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్టీఈటి), జెఈఈ(మెయిన్), సియుఈటి (యుజి), (పీజీ), యుజిసి-నెట్, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సీఈటి), ఐసిఎఆర్ ఎఐఈఈఎ (పిజి) సుమారు 20 జాతీయ స్థాయి పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తుంది. అయితే పేపర్ లీక్స్ ఆరోపణలతో ఎన్డీఏ ప్రతిష్ట దిగజారింది.
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఫెలోషిప్‌ల కోసం జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు 2017లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వయంప్రతిపత్తి గల, స్వయం సమృద్ధి కలిగిన పరీక్షా సంస్థగా దీనిని తీర్చిదిద్దింది. వివిధ విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ సంస్థల తరపున విస్తృత శ్రేణి ప్రవేశ పరీక్షలను నిర్వహించే బాధ్యత ఎన్డీఏపై ఉంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో ఈ సంస్థ విఫలమైందని విమర్శకులు వాదిస్తూ, ఎన్డీఏను రద్దు చేయాలని కూడా కోరుతున్నారు. కానీ అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం పదేపదే స్పష్టం చేస్తోంది.
కాగా, భారతదేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలు నిర్వహించే ఎన్‌టీఏ చాలా తక్కువ సంఖ్యలో ఉన్న శాశ్వత సిబ్బందితో పనిచేస్తున్నదని ప్రభుత్వం ధ్రువీకరించింది. మంజూరైన 39 శాశ్వత పోస్టులకుగాను ప్రస్తుతం ఎన్‌టీఏలో కేవలం 24 మంది అధికారులు మాత్రమే పనిచేస్తున్నారని, 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ రాజ్యసభకు తెలిపారు.
ముఖ్యంగా శాశ్వత పోస్టులన్నీ ప్రత్యక్ష నియామకాల ద్వారా కాకుండా డిప్యుటేషన్ ద్వారానే భర్తీ చేశారు. పరిపాలన సాగడానికి ఈ ఏజెన్సీ తాత్కాలిక, అవుట్‌సోర్స్ సిబ్బందిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. ప్రస్తుతం ఇందులో అడ్వైజర్లు, కన్సల్టెంట్లు, యంగ్ ప్రొఫెషనల్స్‌తో సహా 73 మంది కాంట్రాక్టు సిబ్బంది, అలాగే డాటా అనలిస్టులు, లీగల్ అసోసియేట్స్ వంటి 124 మంది అవుట్‌సోర్స్ ఉద్యోగులు ఉన్నారు.
సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ ద్వారా భర్తీ చేసేందుకు డైరెక్టర్ స్థాయిలో ఎనిమిది, జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఎనిమిది చొప్పున మొత్తం 16 కొత్త పోస్టుల ఆమోదంతో ఎన్‌టీఏ ప్రధాన బృందాన్ని బలపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. 2018లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్‌టీఏ 270కి పైగా పరీక్షలను నిర్వహించింది. 6.6 కోట్లకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు.
ఈ ఒక్క ఏడాదే నీట్ యూజీ సహా 65 లక్షల మందికి పైగా అభ్యర్థులకు సంబంధించి 12 పరీక్షలను ఎన్టీఏ నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 21న మళ్లీ పరీక్ష జరుగగా, జూలై 16న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షలకు సంబంధించిన అనేక వివాదాల నేపథ్యంలో ఎన్‌టీఏపై ప్రజల్లో పరిశీలన పెరుగుతున్న తరుణంలో ఈ వివరాలు వెలువడ్డాయి. ఏటా కోట్లాది మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే ఏజెన్సీకి తగినంత సిబ్బంది ఉన్నారా? అనే కొత్త ప్రశ్నలను ఇది లేవనెత్తుతున్నది.
More Stories
మణిపూర్ హింసాకాండ కేసులకు ప్రత్యేక కోర్టు.. సుప్రీం సూచన
రాజ్యసభలో ‘వందే మాతరం’కు చట్టపర హోదా కల్పిస్తూ బిల్లు
లీకేజీకి పాల్పడితే 10 ఏళ్ల జైలు, రూ. రూ. 10 కోట్ల వరకు జరిమానా