చర్చలకై ప్రభుత్వం నాలుగు సార్లు పిలుపు.. స్పందించని సిజెపి 

చర్చలకై ప్రభుత్వం నాలుగు సార్లు పిలుపు.. స్పందించని సిజెపి 
ఢిల్లీలో నిరసనలు కొనసాగుతుండగా, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం మరోసారి ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సిజెపి)ని చర్చలకు ఆహ్వానించారు. నీట్ యుజి పరీక్షలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఆయన, ఈ విషయంలో కేంద్రం అత్యంత గంభీరంగా ఉందని పేర్కొన్నారు. 
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, చర్చల కోసం సిజెపిని బుధవారం మధ్యాహ్నం నుంచి కేంద్రం నాలుగుసార్లు ఆహ్వానించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు. “విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మేము వారితో నాలుగుసార్లు మాట్లాడటానికి ప్రయత్నించాము.  కానీ స్పందన లేదు. నిరసనకారులు చర్చల కోసం జె.పి. నడ్డా నివాసానికి లేదా కార్యాలయానికి రావచ్చు,” అని అణుశక్తి శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. 
 
విద్యార్థుల సౌలభ్యం మేరకు అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం “చర్చల ద్వారా నెమ్మదిగా పరిష్కారం దిశగా కృషి చేస్తుందని” సింగ్ పేర్కొన్నారు. “విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిరంతర చర్యల పరంపరలో ఇది ఒక భాగం.  “వినమ్రంగా మిమ్మల్ని అందరినీ చర్చలకు రావాలని కోరుతున్నాను,” అని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. 
 
ప్రశ్నపత్రం లీక్ ఘటనల కోసం ‘ఫాస్ట్-ట్రాక్ కోర్టుల’ను ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, అటువంటి కేసుల పట్ల ప్రధాని ఎంతో ‘సున్నితంగా’ స్పందిస్తారని సింగ్ పేర్కొన్నారు. అలాగే యువతకు సంబంధించిన అంశాలకు ఆయన ‘అత్యధిక ప్రాధాన్యత’ ఇస్తారని చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న నిరంతర చర్యలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని సింగ్ తెలిపారు.
 
“దీని స్ఫూర్తితో, ప్రశ్నపత్రం లీక్‌లకు బాధ్యులైన వారిపై ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి, త్వరితగతిన నిర్ణయం తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని ఆయన నిర్ణయించారు,” అని సింగ్ చెప్పారు. “అందుకే, నేను మరోసారి మిమ్మల్ని ఎంతో వినమ్రంగా కోరుతున్నాను: రండి, కూర్చోండి, చర్చించండి; ఈ పరిస్థితికి పరిష్కారం కనుగొనేందుకు మనం నిజాయితీతో కూడిన ప్రయత్నం చేద్దాం” అని పిలుపిచ్చారు. 
 
చర్చలకు సిద్ధమని కేంద్రం పదేపదే చెబుతున్నప్పటికీ, ఆ ప్రతిపాదనను ఆందోళనకారులు తిరస్కరించిన కొద్ది సేపటికే సింగ్ ఈ ఆహ్వానాన్ని పంపారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రశ్నపత్రం లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం కేవలం ఒక ‘తాత్కాలిక ఉపశమన చర్య’ (బ్యాండ్-ఎయిడ్) మాత్రమేనని సిజెపి ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు. మంత్రి ప్రధాన్ రాజీనామా తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.