ఢిల్లీలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్కు భారీ ఊరట లభించింది. ఆయనను చికత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేశారు. సీజేపీ చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను స్థానిక సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ కూడా ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆయన భార్య గీతాంజలి అంగ్మో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు సఫ్దర్‌గంజ్ ఆస్పత్రి నుంచి గుర్గావ్లోని మేదాంత అనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారించిన కోర్టు ప్రభుత్వ స్పందన కోరింది.
అయితే, ఆయనను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వైద్యుల అనుమతితో ఆయనను వేరే ఆస్పత్రికి తరలించవచ్చని చెప్పింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఈ విషయంలో వైద్యుల సలహా మేరకు వ్యవహరించవచ్చని కోర్టుకు తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం వైద్యులు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
అయితే, వాంగ్‌చుక్ చుట్టూ ఉన్న కొందరి తీరుపై ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని కొందరు స్వార్ధానికి వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వాంగ్చుక్ను మేదాంత ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించింది. అక్కడ అందుతున్న చికిత్స కూడా మేదాంతలో కొనసాగించాలని, ఈ విషయంలో వైద్యుల సూచలను పాటించాలని ఆదేశించింది.
అక్కడ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించాలని సూచించింది. వాంగ్‌చుక్ క్షేమమే ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. సఫ్దార్‌గంజ్ ఆస్పత్రిలో అందించే చికిత్స వివరాల్ని మేదాంతకు అందించాలని కూడా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం వాంగ్‌చుక్ రక్తంలో చక్కెర శాతం తగ్గిన నేపథ్యంలో ఓఆర్ఎస్ వంటివి తీసుకునేందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.

More Stories
నీట్ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు
రామమందిర విరాళాల కేసును రాజకీయం చేయవద్దు
సంవత్సరం పొడవునా అశోక్ సింఘాల్ శతజయంతి