* సిట్ ను పునర్వ్యవస్థీకరించాలని సుప్రీంకోర్టు సూచన
అయోధ్యలోని రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసును రాజకీయం చేయవద్దని చెబుతూ దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) పునర్వ్యవస్థీకరించాలని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. ఇలాంటి కేసులను నిర్వహించడంలో అనుభవం ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు జరిగితే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేసింది. ఈ సందర్భంగా, అయోధ్య రామమందిర విరాళాల చోరీపై విచారణకు సిట్ చేయవచ్చా? అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. “మేము చిన్న హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి ఈ అంశాన్ని రాజకీయం చేయకండి. కోర్టులు రాజకీయాలకు వేదికలు కాదు. ఇది కేవలం ఒక నేరానికి సంబంధించిన సాధారణ కేసు. సరైన దర్యాప్తు జరిగేలా చూడడమే మా పని” అని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు.
గతంలో ఏర్పాటు చేసిన సిట్ కి కేవలం ప్రాథమిక నివేదికను సమర్పించే బాధ్యత మాత్రమే అప్పగించబడిందని పేర్కొంది. కాబట్టి, పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేకంగా మరో సిట్ ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, “వాస్తవాలను వెలికితీసేందుకు” సిట్ ను ఏర్పాటు చేశామని, అందులో “కాగ్నిజబుల్ అఫెన్స్” (పోలీసులు స్వయంగా కేసు నమోదు చేయదగిన నేరం) జరిగినట్లు గుర్తించామని కోర్టుకు తెలిపిన తర్వాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, లక్నో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి), ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆ సిట్ లో ఉన్నారని గుర్తుచేస్తూ, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రధాన దర్యాప్తును వారు నిర్వహించగలరా? అని ప్రశ్నించింది. ఇది కేవలం “నేరం జరిగిన సాధారణ కేసు” అని పేర్కొంది. “ఒక చిన్న సూచన. దయచేసి ఈ అంశాన్ని రాజకీయీకరించవద్దు. న్యాయస్థానాలు రాజకీయాలకు వేదికలు కావు… సరైన దర్యాప్తు జరిగేలా చూడటమే మా బాధ్యత,” అని సిజెఐ కాంత్ స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎటువంటి తుది ఉత్తర్వు లేదా ఆదేశం జారీ చేయని కోర్టు, జూలై 27న ఈ కేసును మళ్లీ విచారించనుంది. సిట్ తన స్థితిగతుల నివేదికను సీల్డ్ కవర్‌లో ధర్మాసనానికి సమర్పించిన మరుసటి రోజే అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. జూలై 13న జరిగిన విచారణ సందర్భంగా నివేదికను సమర్పించాలని కోర్టు సిట్ ను ఆదేశించింది. ఆ సమయంలో, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
“కొన్ని రిట్ పిటిషన్లలో ఇప్పటికే కొన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి సిట్ ని ఏర్పాటు చేశారని పేర్కొన్నందున, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ని ఈ కోర్టు ముందు స్థితిగతుల నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశిస్తున్నాము,” అని కోర్టు అప్పట్లో పేర్కొంది.
“దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నేను అంత కంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేను” అని చెప్పారు. దీనితో కేసును సిట్ దర్యాప్తు చేస్తోందా అని కోర్టు ప్రశ్నించగా, “వాస్తవాలను తెలుసుకోవడానికి మాత్రమే సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఒక నేరం జరిగిందని మాత్రమే సిట్ కనిపెట్టింది” అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
మరోవైపు భక్తులు సమర్పించిన బంగారం, వెండి, నగలు మాయమయ్యాయని, వాటికి సంబంధించిన విరాళాలు, వివరాల్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇలా ఆన్‌లైన్‌లో వివరాలు బహిరంగ పరచడం వల్ల తప్పుడు విరాళాలు ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉందని, అందువల్ల అది సాధ్యం కాదని కోర్టు తెలిపింది. అయితే, విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాల్ని, రశీదుల్ని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించింది.
ఎస్‌బిఐ పర్యవేక్షణలో అయోధ్య
ఇలా ఉండగా, అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపు ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. లెక్కింపు విదానాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ కానుకల లెక్కింపు బాధ్యతలను దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించనుంది.
విరాళాల లెక్కింపు మొత్తం నిపుణులైన ఎస్‌బిఐ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో, పూర్తి భద్రత నడుమ జరుగుతుందని వెల్లడించింది. పెరిగిపోతున్న కానుకల నిల్వలను దృష్టిలో ఉంచుకుని, రోజుకు 12 గంటల పాటు లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. ఈ 12 గంటల లెక్కింపు నిరంతరాయంగా సాగేందుకు వీలుగా సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించినట్లు తెలిపారు. పకడ్బందీగా ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

More Stories
వాంగ్చుక్కు మేదాంత ఆస్పత్రిలో చికిత్సకు కోర్టు అనుమతి
భద్రతా దళాలపైకి బూట్లు, చెప్పులు, బీర్ సీసాలు విసిరారు
నీట్ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు