* ఓ దశలో అరెస్ట్ చేయాలని ఆదేశం
ఓ ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేమిటని నిలదీసింది. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్థలంలోకి వెళ్లరాదన్న ఆదేశాలను మూడుసార్లు ధిక్కరించినందుకు అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది.
ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్టు ఆదేశాలను విరమించుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయన సాయంత్రం 6.30 గంటలకు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం రంగనాథ్ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలవాటుపడ్డ నేరగాడిలా మారారని వ్యాఖ్యానించింది.
మల్కాజ్గిరి మండలం లోతుకుంటలోని సర్వే నెంబర్లు 1, 2లలో ఉన్న భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, శాంత శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. సివిల్ సూట్, మొదటి అప్పీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో ప్రభుత్వం హైడ్రా ద్వారా జోక్యం చేసుకుంటోందని పేర్కొంటూ రెండుసార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆ భూమిలోకి ఎట్టిపరిస్థితుల్లో ప్రవేశించరాదని రెండు సార్లు కూడా హైకోర్టు గట్టి హెచ్చరిక జారీచేసింది. అయినప్పటికీ మూడోసారి కూడా హైడ్రా తమ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని పేర్కొంటూ ఆ సంస్థ యజమానులు హైకోర్టులో మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
లంచ్‌మోషన్ రూపంలో ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సాయంత్రం విచారణకు రంగనాథ్ కాగా, హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం హైడ్రా కమిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
“ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం చెల్లదు. కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారు. అది ప్రైవేటు భూమి అని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అది నచ్చకపోతే చట్టప్రకారం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలి. అంతేగానీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రైవేటు భూమిలోకి వెళ్లి విధ్వంసం సృష్టించడం ఏమిటి?” అంటూ ప్రశ్నించింది.
“ఒక్కసారి కాదు మూడుసార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. న్యాయవ్యవస్థతో తలపడాలని చూస్తున్నట్లు ఉన్నారు. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఆయన అలవాటుపడ్డ నేరగాడిలా మారారు. ఏ కారణంతో పిటిషనర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదంటే కావాలని చేసినట్లే కదా? హైడ్రా కమిషనర్ వైఖరి అర్థరహితం. అరాచకం. కోర్టు చెప్పిన తర్వాత కూడా అనుకున్నదే చేస్తానన్న వైఖరి గర్హనీయం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలే చెప్తున్నాయని పేరొంది. ఇకడ బాధితుడు పిటిషనర్ కాదని, స్వయంగా కోర్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధికరించడం ఎంతమాత్రం సహించబోమని రంగనాథ్‌కు తేల్చిచెప్పింది. ప్రభుత్వమైనా, ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేయడంతో అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

More Stories
హైదరాబాద్‌పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ క్యూర్ చట్టం
భద్రతా దళాలపైకి బూట్లు, చెప్పులు, బీర్ సీసాలు విసిరారు
నీట్ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు