ఢిల్లీలో సోమవారం నాడు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిపిజే) చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ వైపుగా సాగిన ‘చలో సంసద్’ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలకు చెందిన 118 మందికి పైగా సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 10 మందికి పైగా ఐపీఎస్, డానిప్స్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు.
అనేక మంది సిబ్బందికి ఎముకలు విరిగినట్లు వైద్య నివేదికలు సూచిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. పలు ఆసుపత్రులలో ఇంకా చాలా మంది పోలీసులు చికిత్స పొందుతుండటంతో, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోలీసులు, సిపిజే నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
ఆ వీడియోల వాస్తవికతను నిర్ధారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సూచించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సంయమనం పాటించాలని, శాంతియుతంగా వ్యవహరించాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలని, అలాగే ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని నిరసనకారులకు సూచించారు.
కాగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సుమారు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అదుపులోకి తీసుకున్న వారు విద్యార్థులు కాదని పోలీసులు స్పష్టం చేశారు. వారి వ్యక్తిగత వివరాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 15 నుండి 20 పోలీసు వాహనాలు ధ్వంసమైన ఈ ఘర్షణలకు సంబంధించి, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
“సుమారు 70 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నాము. తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. అల్లర్లు, ప్రభుత్వ అధికారులపై దాడి, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడం, నిరసన సమయంలో జరిగిన ఇతర నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత, ఇతర వర్తించే చట్టాలలోని సంబంధిత నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నాము” అని పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, న్యూఢిల్లీ జిల్లాలో, ముఖ్యంగా సెంట్రల్ పార్క్, ఇన్నర్ సర్కిల్, వాటిని ఆనుకుని ఉన్న రోడ్లలో భారీగా పోలీసు, పారామిలిటరీ బలగాల మోహరింపు కొనసాగుతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపకుండా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే అవకాశం తక్కువ. అయితే, వారు నిరసన స్థలాన్ని బురారీ మైదానానికి మార్చుకోవాలని కోరే అవకాశం ఉంది.
“పాల్గొనేవారందరూ శాంతియుతంగా వ్యవహరించాలని, ఎటువంటి చట్టవిరుద్ధమైన లేదా హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు/సిబ్బంది జారీ చేసే చట్టబద్ధమైన ఆదేశాలను పాటించాలని ఢిల్లీ పోలీసులు ‘ఎక్స్’ వేదికగా కోరారు.”
కాగా, పార్లమెంటులో ఎంపీలను కలిసేందుకు తమ యూత్ లీడర్లను అనుమతించే వరకూ తన ఆమరణ దీక్ష కొనసాగుతుందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పంపిన మరో సందేశాన్ని ఆయన భార్య గీతాంజలి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాన్కే కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన తరువాత సోనమ్ వాంగ్‌చుక్ ఈ సందేశాన్ని విడుదల చేశారు. ఆమరణ దీక్ష చేస్తున్న సోనమ్ ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
మరోవంక, పగలంతా నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, సాయంత్రం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, అర్ధరాత్రి దాటిన చాలా సేపటి వరకు జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రదేశంలో విద్యుత్తు లేకపోవడంతో విద్యుత్తును ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని నిరసనకారులు ఆరోపించారు. ప్రజలు నీళ్ల సీసాలు, బిస్కెట్లు, ఇతర నిత్యావసరాలు తీసుకుని, మొబైల్ ఫోన్ టార్చ్‌లైట్ల వెలుగులో వేదిక చుట్టూ తిరిగారు. అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.

More Stories
వాంగ్చుక్కు మేదాంత ఆస్పత్రిలో చికిత్సకు కోర్టు అనుమతి
భద్రతా దళాలపైకి బూట్లు, చెప్పులు, బీర్ సీసాలు విసిరారు
నీట్ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు