ఎస్ఐఆర్ ప్రక్రియలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లపై జరుగుతున్న బెదిరింపులు, అక్రమ జోక్యం, ఓటరు నమోదు ప్రక్రియకు ఆటంకాలు, బీఎల్‌ఓలపై ఒత్తిళ్ల అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని బీజేపీ ప్రతినిధి బృందం కోరింది. 2025 నుంచి బీఎల్ఓలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని, ఆదుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో ఓ ప్రతినిధి వర్గం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం సమర్పించా
ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు, ఐటీ ఉద్యోగులు, వృత్తి రీత్యా స్థిరపడిన పౌరులు నివసిస్తున్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భారతదేశంలోని ఏ పౌరుడైనా తాను నివసిస్తున్న ప్రాంతంలో ఓటు నమోదు చేసుకునే పూర్తి హక్కు కలిగి ఉంటారని, అయితే ఒకే వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు ఉండాలని, రెండుచోట్ల ఓటు నమోదు చేయడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు.
కానీ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు కాకుండా కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఎల్‌ఓలపై ఒత్తిళ్లు తీసుకొస్తూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు కాకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తాను స్వయంగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలను ప్రత్యక్షంగా గమనించానని తెలిపారు. అక్కడ అర్హులైన ఓటర్లను తప్పుదోవ పట్టించడం, నమోదు ప్రక్రియకు ఆటంకాలు కల్పించారని పేర్కొన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న నార్త్ ఇండియన్స్, ఐటీ ఉద్యోగులు ఇక్కడే ఓటు నమోదు చేసుకోవాలని ముందుకు వస్తున్నప్పటికీ, వారిని ఓటరు జాబితాలో చేర్చకుండా ప్రయత్నించడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులైన బీఎల్‌ఓలపై రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో నివసిస్తే ఇక్కడే ఓటు నమోదు చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును వారికి ఉంది, ఆ హక్కును ఎవరూ కాలరాయలేరని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో బీజేపీకి అనుకూలంగా ఉండే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కాకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ, ఓటు నమోదు విషయంలో ఎక్కడైనా ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమాలు ఎదురైతే వెంటనే బీజేపీ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి, ఓటర్ల హక్కులను పరిరక్షించేలా తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి హామీ ఇచ్చారని తెలిపారు.

More Stories
విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి శ్రేణులు
గాంధీ భవన్ ముట్టడికి పిలుపు.. బిజెపి నాయకుల అరెస్ట్
ఖతార్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి మూలకేంద్రం