జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలో ఆదివారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. రహదారులు దెబ్బతినడం, వాగులు ఉప్పొంగడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ, పలు ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
మరోవైపు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన దిల్లీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని జమ్ముకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పూంచ్ జిల్లాలోని సురన్‌కోట్ తహసీల్ అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. లోయర్ ముర్రా గ్రామంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఓ ఇంటిపై పడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
రెస్క్యూ సిబ్బంది ఐదుగురి మృతదేహాలను వెలికితీశాయి. వీరిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. అదే తహసీల్‌లోని సంగ్లా గ్రామంలో ఆకస్మిక వరదల ధాటికి మరో ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. సంగ్లా గ్రామంలో ఆకస్మిక వరదల ధాటికి మరో ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు.
వర్షాలు పడుతున్నప్పటికీ స్థానిక పరిపాలన, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, ఇతర ప్రభుత్వ శాఖలు కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుండగా, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గాయపడిన వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. రాజౌరి జిల్లాలోనూ రాత్రంతా కురిసిన వర్షాలకు నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి.
లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలాల్సి వచ్చింది. రాజౌరి పట్టణంలో నది ప్రవాహంలో ఓ మహిళ మృతదేహం లభించింది. వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం, మరికొన్ని నీటిలో మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పలు ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ భూములు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్, తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడింది. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజా, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పూర్తి స్థాయి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Stories
దేశంలోనే తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం
అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
సముద్ర గర్భంలో శత్రువుల వేటలో ఛత్రపతి శివాజీ పులిగోరుతో యుద్ధనౌక