* నిరసన ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న ప్రతిపక్షాలు!
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిపిజే) నిరసనపై ఢిల్లీ పోలీసులు జరిపిన చర్యలు, సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్షాలు ఈ ఆందోళన ద్వారా కేవలం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం ఎదురుదాడి చేసింది. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ, జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్ను తరలించినప్పుడు ప్రశ్నించిన వారెవరూ, ఆయన్ని ఆసుపత్రికి తరలించే సమయంలో మాత్రం కనిపించలేదని ఎద్దేవా చేశారు.
“అధికారులు జోక్యం చేసుకున్నప్పుడు, ఆయన నిరాహార దీక్షను రాజకీయ ప్రదర్శనగా మార్చిన వారిలో చాలామంది ఎక్కడా కనిపించలేదు. అత్యంత కీలకమైన సమయంలో వారు అక్కడ లేరు,” అని మాలవీయ పేర్కొన్నారు. ఈ నిరసన పట్ల ప్రతిపక్షాలకు ఎప్పుడూ నిర్మాణాత్మకమైన దృక్పథం లేదని బీజేపీ నేత స్పష్టం చేశారు.
“వారి లక్ష్యం సమస్య పరిష్కారం కాదు, రాజకీయ లబ్ధి కోసం సంక్షోభాన్ని కొనసాగించడం. ఆ అవకాశం ఇప్పుడు వారికి దక్కకుండా పోయింది” అంటూ ధ్వజమెత్తారు.
మరొక బీజేపీ నేత తజిందర్ బగ్గా మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద పోలీసులు జరిపిన చర్యలు బీజేపీని పూర్తిగా బయటపెట్టాయని పేర్కొన్నారు. ఇంజనీర్ సోనమ్ వాంగ్చుక్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించడానికి ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్దకు వచ్చినప్పుడు, అక్కడ ఒక్క ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేత కూడా లేరని బగ్గా ఆరోపించారు.
“డిప్కే లేరు, నాచనియా లేరు, అధికార ప్రతినిధి లేరు. వారంతా ఫైవ్-స్టార్ హోటళ్లలో హాయిగా నిద్రపోతున్నారు. ఇప్పుడు తాము స్నానం చేయడానికి, ఫ్రెష్ అవ్వడానికి వెళ్లామని సిజెపి చెప్పుకుంటోంది,” అని ఆ బీజేపీ నేత మండిపడ్డారు. ఇదిలా ఉండగా, శనివారం మధ్యాహ్నం జంతర్ మంతర్ వద్ద మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.
సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టిన కొద్ది గంటలకే, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఒక మహిళ ఆయనపై సిరా వంటి ద్రవాన్ని విసిరింది. మద్దతుదారులు వేదిక వైపు దూసుకెళ్లడంతో అక్కడ గందరగోళం నెలకొంది. కార్యక్రమానికి కాసేపు అంతరాయం కలిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పంచుకుంటూ డిప్కే, “నీలం నా రంగు… జై భీమ్!” అని స్పందించారు.
ఆ మహిళ వివరాలు, ఆమె చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యం వెంటనే తెలియరాలేదు. ఢిల్లీ పోలీసులు ఆ మహిళను అక్కడి నుండి బయటకు తీసుకెళ్లారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో శనివారం మాట్లాడుతూ, సోనమ్ వాంగ్చుక్కు లేదా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన్ని జంతర్ మంతర్ నిరసన స్థలం నుండి ఆసుపత్రికి తరలించారని తెలిపారు. సోనమ్ వాంగ్చుక్ జూలై 20న జరిగే నిరసన ర్యాలీలో పాల్గొనలేకపోయినా, తాను ఆయన తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ర్యాలీకి నాయకత్వం వహిస్తానని, అనుకున్నట్లుగానే అది సోమవారం జరుగుతుందని ఆమె చెప్పారు.
మరోవంక, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఉదయం ఢిల్లీ పోలీసులు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ధర్నా క్షేత్రం నుంచి ఆస్పత్రికి తరలింపు ప్రక్రియ ముగిసిన తర్వాత వాంగ్చుక్ నిరాహార దీక్షకు కూర్చున్న ప్రదేశంలో అభిజీత్ దీప్కే ఆందోళనకు దిగారు. అయితే జూలై 20వ తేదీన జరగాల్సిన తమ ర్యాలీ యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి ప్రజలు రావాలని ఆయన వేడుకున్నారు.
కాగా, ఈ ఘటన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మరో నల్లమచ్చగా నిలిచిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. “ఈ నియంతృత్వ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టలేదు. గంగానది సంరక్షణ కోసం కోసం 111 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ అయినా, హరియాణాకు చెందిన ఒలింపిక్ రెజ్లర్ అయినా, మనకు అన్నం పెట్టే రైతులు, దళితులు, ఆదివాసీలు, పేపర్ లీక్ వ్యవహారంలో బలైపోయిన పిల్లలు ఇలా ఎవరినీ వదలలేదు. వారి దృష్టిలో, గొంతు ఎత్తే ప్రతి ఒక్కరూ దేశద్రోహి లేదా పరాన్నజీవి. కోటా, దెహ్రదూన్ నుంచి విద్యార్థుల గళం అనే పిలుపు మొదలైంది. అది కచ్చితంగా దిల్లీ గడపను తాకుతుంది” అని విమర్శించారు.

More Stories
నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1
వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మూడింట రెండు వంతుల మెజారిటీకి 6 ఎంపీల దూరంలో ఎన్డీయే!