వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను డిల్లీ పోలీసులు శనివారం భారీ భద్రత మధ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జంతర్‌మంతర్ వద్ద గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 20న పార్లమెంట్‌కు చేపట్టనున్న ర్యాలీకి రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.

డిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకు వాంగ్‌చుక్‌కు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిరాహార దీక్ష కొనసాగుతుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణిస్తోందని వైద్యులు నివేదించిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించి, అత్యవసర విభాగంలో చేర్చారు. ఆయన స్పృహలోనే ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి (వైటల్స్) నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. “అందరికీ శుభోదయం. సోనమ్ వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరారని మీకు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయబడుతుంది,” అని ఆసుపత్రి ఒక ప్రకటనలో పేర్కొంది

వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించే సమయంలో అక్కడ ఉన్న నిరసనకారులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు స్వల్ప గందరగోళం నెలకొంది. అయితే పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ ఆయనను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జంతర్‌మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించారు. 

గత 20 రోజులుగా కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష చేయడం వల్ల వాంగ్‌చుక్ దాదాపు 20 శాతం బరువు కోల్పోయారు. సుమారు 9 కేజీలకు పైగా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు 56.55 కిలోలు మాత్రమే. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. ఆయన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయి. కండరాల క్షీణతతో ఆరోగ్యం బాగా దెబ్బతింది. డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీక్ష ఇలాగే కొనసాగి ఉంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.

 
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయనతో పాటు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.