పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ కు నిజాయితీ గానీ, మంచి ఉద్దేశాలు గానీ లేవని, అది “కట్టర్ బేఇమాన్” (అత్యంత అవినీతిపూరితమైన) ప్రభుత్వం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. పవిత్ర భూమి పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంలో నేరగాళ్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు
దేశవ్యాప్తంగా 75 పునరుద్ధరించిన రైల్వే స్టేషన్లతో సహా రూ. 5,470 కోట్ల విలువైన రైలు, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అనంతరం జలంధర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ఎప్పుడు, ఎక్కడ ముఠా గొడవలు చెలరేగుతాయో లేదా ఏ దిశ నుంచి బుల్లెట్లు దూసుకొస్తాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.
“బహిరంగంగానే వసూళ్లకు డిమాండ్లు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లపై దాడులు కూడా తరచుగా జరుగుతున్నాయి” అని మోదీ మండిపడ్డారు. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి, ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉద్దేశించినవని అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులపై దాడి, దోపిడీకి పాల్పడినందుకు ఆప్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గుజరాత్ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు గురించి మోదీ ప్రస్తావించారు.
పంజాబ్ పేరుతో అప్పులు చేస్తున్నారని, బడ్జెట్లో అధిక భాగం ఆ అప్పుల వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతోందని, అదే సమయంలో రాష్ట్రాన్ని నడుపుతున్న వారు ఆ డబ్బుతో లబ్ధి పొందుతున్నారని ప్రధాని ఆరోపించారు. అకాలీ దళ్‌పై కూడా మోదీ విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ తన సొంత వ్యవహారాల్లోనే మునిగిపోయిందని, ప్రజల పట్ల దానికి ఎలాంటి శ్రద్ధ లేదని ఆయన ధ్వజమెత్తారు.
“పంజాబ్ అంతటా అభివృద్ధి పనులు స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రదర్శించబడుతున్న ప్రాజెక్టులన్నీ భారత ప్రభుత్వం చేపట్టినవే. అందుకే అన్నారు. జలంధర్ ఇప్పుడు అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోంది,” అని ఇక్కడ ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.
పంజాబ్‌లో మార్పును తీసుకురావడం కేవలం బీజేపీ వల్ల సాధ్యమవుతుందని స్పష్టం చేస్తూ సుసంపన్నమైన పంజాబ్ నిర్మాణానికి కేంద్రం అంకితభావంతో పనిచేస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. పంజాబ్ యువతకు అత్యంత తీవ్రమైన నష్టం జరుగుతోందని చెబుతూ పంజాబ్ భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వ్యాపారులు స్వేచ్ఛగా తిరుగుతూ, పంజాబ్ యువతను వ్యసనం అనే చిత్తడిలోకి లాగుతున్నారని మండిపడ్డారు.
పంజాబ్‌లో బీజేపీ ప్రభుత్వం లేనప్పటికీ, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా కృషి చేస్తోందని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ, “2014కు ముందు రైల్వే పరిస్థితి ఎలా ఉండేది? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రైళ్ల గురించి కేవలం అవాస్తవ ప్రకటనలు చేసి ఊరుకునేది,” అని ఆయన ఎద్దేవా చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ విభాగంలో ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న అంతర్గత పోరు ఎప్పటికీ ముగిసేలా లేదని కూడా మోదీ వ్యాఖ్యానించారు. “వారు ప్రజల కోసం పోరాడటం లేదు, తమలో తామే పోరాడుకుంటున్నారు,” అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా, రెండు ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య ప్రత్యక్ష రైలు అనుసంధానాన్ని కల్పిస్తూ, అమృత్సర్ (ఛెహర్తా)-వారణాసి ‘సంత్ రవిదాస్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
ఫిబ్రవరిలో ‘డేరా సచ్‌ఖండ్ బల్లన్’ను సందర్శించిన తర్వాత జలంధర్‌కు మోదీ రావడం ఇది రెండోసారి. 2027 పంజాబ్ ఎన్నికలకు ముందు చేపట్టిన రాజకీయ ప్రచార చర్యగా ఈ పర్యటనను భావిస్తున్నారు; ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది.

More Stories
సేవ, ఐక్యత, జాతీయ చైతన్యంలను బలోపేతం చేసిన ఆర్ఎస్ఎస్
ఓటర్ జాబితాలో పేరు లేకుంటే పౌరసత్వం కోల్పోయినట్టు కాదు
సక్సెస్ ది స్కూల్లో ‘కల్మా’ వివాదంపై ఎన్హెచ్ఆర్సి నోటీసు