ఓటర్‌ జాబితాలో పేరు లేకుంటే పౌరసత్వం కోల్పోయినట్టు కాదు

ఓటర్‌ జాబితాలో పేరు లేకుంటే పౌరసత్వం కోల్పోయినట్టు కాదు

ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించినంత మాత్రాన పౌరసత్వాన్ని కోల్పోయినట్లు కాదని సుప్రీంకోర్టు శుక్రవారం మౌఖికంగా పునరుద్ఘాటించింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అంతిమ అధికారం భారత ఎన్నికల సంఘానికి లేదని, అలాగే ఓటర్ల జాబితా నుండి పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వాన్ని కోల్పోయినట్లు కాదని బీహార్‌ సర్‌ తీర్పులో తాము స్పష్టం చేశామని సుప్రీంకోర్టు పేర్కొంది. 

సర్‌ తర్వాత ఓటర్ల జాబితాలో పేర్లు లేని వ్యక్తుల అప్పీళ్లను విచారించే అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లలో విచారణ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రసేన్‌జిత్‌ బోస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వీ మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. 

19 అప్పిలేట్‌ ట్రిబ్యునళ్ల ఎదుట(వీటి నుంచి ఇద్దరు న్యాయమూర్తులు రాజీనామా చేశారు) 34 లక్షల అప్పీళ్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 38,000 అప్పీళ్లపై మాత్రమే నిర్ణయం తీసుకున్నారని, వాటిలో కనీసం 70 శాతం అప్పీళ్లపై సానుకూలంగా తీర్పు వచ్చిందని ఆయన చెప్పారు. 

అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగానే ఓటర్ల జాబితా నుండి పేర్లు కోల్పోయిన వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌), అన్నపూర్ణ యోజన వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిందని సీనియర్‌ న్యాయవాది పేర్కొన్నారు. అంతేగాకుండా అటువంటి వ్యక్తులకు కుల ధ్రువీకరణ పత్రాలను కూడా నిరాకరిస్తున్నారని ఆయన చెప్పారు. 

ఈ సందర్భంగా జస్టిస్‌ బాగ్చీ మాట్లాడుతూ బీహార్‌ సర్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, పౌరసత్వాన్ని నిర్ణయించే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీఐకి లేదని పేర్కొన్నారు. పౌరసత్వంపై సందేహాల కారణంగా ఒక వ్యక్తి పేరును ఓటర్ల జాబితా నుండి తొలగించినపుడు ఆ వ్యక్తి పౌరసత్వ హోదాను నిర్ధారించాలని కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేయాల్సిన బాధ్యత ఈసీఐపై ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

దీనికి సీనియర్‌ న్యాయవాది స్పందిస్తూ ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడిన వారికి సర్‌ ప్రక్రియ తర్వాత ప్రభుత్వం ఇతర ప్రయోజనాలను కూడా నిరాకరిస్తుందని ఎవరూ ఊహించలేదని చెప్పారు. ఆ విషయం న్యాయమూర్తుల దృష్టికి వచ్చిందని తాను భావించడం లేదని, ఎందుకంటే అలా జరిగి ఉంటే ఈ అంశంపై విచారణ జరుగుతున్నంత కాలం పౌరులకు లభించే ఇతర పౌర హక్కులకు భంగం కలిగించవద్దని ఒక వాక్యాన్ని తీర్పులో జోడించి ఉండేవారని ఆయన పేర్కొన్నారు.