మానవ హిత ఉపాధి దిశగా కృషి చేయాలి

మానవ హిత ఉపాధి దిశగా కృషి చేయాలి

* 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ (టియుఎఫ్) సదస్సులో కేంద్ర మంత్రి డా. మాండవీయ పిలుపు 

సాంకేతిక పురోగతికి సామాజిక న్యాయం, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలు, మానవ గౌరవం మార్గనిర్దేశం చేయాలని, కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే అంతర్జాతీయ వ్యవస్థను నిర్మించాలని  కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ‘15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ (టియుఎఫ్) సదస్సు–2026’ను మంగళవారం ప్రారంభిస్తూ భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ఇతివృత్తం – ‘‘స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’’ గురించి వివరించారు. 

భవిష్యత్తులో ఉపాధి సమ్మిళితంగా, సమానత్వంతో కూడినదిగా, కార్మికుల సంక్షేమమే ప్రధానంగా ఉండేలా చూడటంలో దేశం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధిని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతూ కార్మికుల హక్కులను పరిరక్షించడంలోనూ, పారిశ్రామిక సామరస్యాన్ని బలోపేతం చేయడంలోనూ, ఆర్థిక పురోగతితో పాటు సామాజిక న్యాయం కలసి సాగేలా చేయడంలోనూ కార్మిక సంఘాలు కీలకమైన పాత్రను పోషించాయని మంత్రి తెలిపారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ దార్శనికతకు భారత్ కట్టుబడి ఉందని, దీనిలో సుస్థిరాభివృద్ధికి బలమైన ఆధారాలుగా ఆర్థిక వృద్ధి, కార్మిక సంక్షేమం ఉంటాయని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంస్కరణల గురించి మంత్రి వివరిస్తూ 29 కార్మిక చట్టాలను నాలుగు సరళమైన లేబర్ కోడ్‌లుగా మార్చామని, అవి కార్మికుల హక్కులను మరింత బలోపేతం చేశాయని మంత్రి చెప్పారు. 

ఈ సంస్కరణల ద్వారా కనీస వేతనాలు, నియామక పత్రాలు, మెరుగైన వృత్తి భద్రత, ఆరోగ్యం, డిజిటల్ అమలు వ్యవస్థలను అందరికీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అదేవిధంగా మొదటిసారి గిగ్, ప్లాట్‌ఫామ్ శ్రామికులకు అధికారిక గుర్తింపునిచ్చాయి. కార్మిక విధానాలను మార్చడానికి డిజిటల్ మౌలిక వసతులను భారత్ సద్వినియోగం చేసుకుందని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. 

‘ఈ–శ్రామ్’ పోర్టల్లో 317 మిలియన్ల మంది అసంఘటిత కార్మికులు నమోదు చేసుకోగలగడంతోవారికి వివిధ సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఉద్యోగార్థులు, సంస్థలు, కెరీర్ సెంటర్లు, శిక్షణ సంస్థలను జాతీయ స్థాయి డిజిటల్ ఉపాధి వేదిక అయిన నేషన్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనుసంధానించిందని చెప్పారు. జాతీయ సామాజిక భద్రత వ్యవస్థ గురించి కూడా మంత్రి వివరించారు. 

ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక భద్రత సంస్థల్లో ఒకటైన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 80 మిలియన్ల మంది క్రియాశీలక సభ్యులు, 8 మిలియన్ల మంది పింఛనుదారులు ఉన్నారని మంత్రి తెలియజేశారు. అలాగే 150 మిలియన్ల మంది బీమాదారులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలను, సామాజిక భద్రతా ప్రయోజనాలను కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) అందిస్తుందని చెప్పారు. 

ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీల్లో నిరంతరం చేపడుతున్న సంస్కరణల వల్ల కవరేజీ విస్తృతి పెరిగిందని, విధాన ప్రక్రియలు సరళీకృతమయ్యాయని, సేవలు మెరుగయ్యాయని ఆయన వెల్లడించారు. భారత్‌లో సామాజిక భద్రత పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 2015లో 19 శాతం మాత్రమే ఉండగా, 2025 నాటికి దేశంలో 94 కోట్ల మందితో అది 64.3 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. 

ఈ సంఖ్య వంద కోట్లకు చేరినట్టు 2026 ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనపై మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం దాదాపు 170 మిలియన్ల ఉపాధి అవకాశాలను కల్పించిందని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. ‘ఉద్యోగావకాశాలను బట్టి ప్రోత్సాహకాల’ విధానం ద్వారా  వచ్చే రెండేళ్లలో వ్యవస్థీకృత రంగంలో 35 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాలని ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య త్రైపాక్షిక చర్చల ఆధారంగా దేశ కార్మిక పరిపాలన విధానాన్ని రూపొందించినట్టు డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీ వంటి సంస్థలూ, కార్మిక చట్టాల పరిధిలోని చట్టబద్ధ సంస్థలూ త్రైపాక్షిక యంత్రాంగం ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తాయని, కార్మిక వ్యవహారాల నిర్వహణలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని వివరించారు.

దాదాపు సగం ప్రపంచ జనాభాకు బ్రిక్స్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, ప్రపంచంలో అతిపెద్ద కార్మిక శక్తుల్లో ఒకటిగా బ్రిక్స్ ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. సామాజిక భద్రత, కార్మికుల రాకపోకలు, నైపుణ్యాభివృద్ధి, ఏఐ పాలన, గౌరవప్రదమైన పని వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి గణనీయమైన అవకాశాలున్నాయని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల సమావేశానికి ఈ వేదిక చేసే సిఫార్సులు ఎంతో దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

అంతకుముందు బ్రిక్స్ కార్మిక సంఘాల ఫోరం సదస్సు – 2026 చైర్మన్, భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు శ్రీ సుంకరి మల్లేశం మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించడానికి, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఈ సదస్సు లక్ష్యమని తెలిపారు. 

బీఎంఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, బ్రిక్స్ కార్మిక సంఘాల ఫోరం ముఖ్య సంధానకర్త బి. సురేంద్రన్ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ చర్చలు అర్థవంతమైన ఫలితాలనిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

బ్రిక్స్ దేశాల ప్రతినిధులు కార్లస్ అగస్టో ముల్లర్ (బ్రెజిల్), రష్యా స్వతంత్ర కార్మిక సంఘాల సమాఖ్య (ఎఫ్ఎన్‌పీఆర్) చైర్మన్ సెర్గీ చెర్నోగాయేవ్, హుజియాంగ్ ఝూ (చైనా), మసలే గాడ్‌ఫ్రే సెలెమత్సేలా (దక్షిణాఫ్రికా), ఐఎల్‌వో-న్యూఢిల్లీ కార్మిక వ్యవహారాల నిపుణురాలు శ్రీమతి యూకీ ఒట్సుజీ, జస్టిస్ (విశ్రాంత) ఎన్. నగరేశ్ ప్రారంభ సదస్సులో పాల్గొన్నారు. 

బీఎంఎస్ నిర్వహించిన ఈ మూడు రోజుల సదస్సు 50కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, భారతీయ కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 70 మంది ప్రతినిధులు, కార్మిక వ్యవహారాల నిపుణులు, విద్యావేత్తలను ఒకే వేదికపై చేర్చింది. సార్వత్రిక సామాజిక భద్రత – అందరికీ ప్రయోజనాల వర్తింపు, సమాజ హిత సాంకేతికత – బాధ్యతాయుత ఏఐ, భవిష్యత్ ఉపాధి అవకాశాల దిశగా నైపుణ్యాభివృద్ధి, మారుతున్న పని వ్యవస్థలో మహిళలు అనే నాలుగు ప్రత్యేక ఇతివృత్తాలపై మిగతా రెండు రోజుల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తారు.