ఈ20 ఇంధనం (పెట్రోల్‌తో 20% ఇథనాల్ కలిపిన మిశ్రమం), ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలపై నెలకొన్న ఆందోళనలను తోసిపుచ్చుతూ ఈ ఇంధనం ఇంజన్లను దెబ్బతీసింది అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. విస్తృతమైన పరీక్షలు జరిపిన తర్వాతే కేంద్రం ఈ సాంకేతికతను తీసుకువచ్చిందని ఆయన తేల్చి చెప్పారు.
ఇండియా టీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏదైనా కొత్త సాంకేతికతను అమలు చేయడానికి ముందు క్షుణ్ణంగా సమీక్షిస్తుందని చెప్పారు. సమగ్రమైన పరీక్షలు జరిపిన తర్వాతే ఈ20 ఇంధనాన్ని ప్రవేశపెట్టామని, దీని వాడకం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాదనలను ప్రస్తావిస్తూ, కొందరు కావాలనే గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని గడ్కరీ ఆరోపించారు. “ప్రజలను ఒప్పించలేనప్పుడు, వారిని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి,” అని ఆయన హెచ్చరించారు. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారనే దానిపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇథనాల్ వల్ల కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను వివరిస్తూ, భారతదేశం ప్రస్తుతం శిలాజ ఇంధనాల దిగుమతులపై ఏటా రూ. 22 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని, అంతేకాకుండా దేశంలో రోడ్డు రవాణా రంగం వల్ల కలిగే వాయు కాలుష్యానికి కూడా దాదాపు 40% ఈ దిగుమతులే కారణమని గడ్కరీ తెలిపారు.
దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాల స్థానంలో జీవ ఇంధనాలను వాడటం వల్ల దేశ దిగుమతుల బిల్లు తగ్గడమే కాకుండా, ఆ డబ్బు నేరుగా భారతీయ రైతుల చేతుల్లోకి వెళ్తుందని, తద్వారా వారి జీవనోపాధి గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ఇథనాల్ ఉత్పత్తి విస్తరణ ఇప్పటికే రైతులకు సానుకూల ఫలితాలను ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
దీనికి ఉదాహరణగా ఆయన మొక్కజొన్నను పేర్కొంటూ, ఇథనాల్ ఉత్పత్తికి పెరిగిన డిమాండ్ వల్ల మొక్కజొన్న ధరలు పెరిగాయని, ఇది రైతులకు ప్రయోజనం చేకూర్చిందని చెప్పారు. ఇంతకుముందు చక్కెర మిల్లుల నుండి చెల్లింపులు అందుకోవడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చిన చెరకు రైతులు, ఇథనాల్ ఉత్పత్తి కారణంగా మెరుగైన ఆర్థిక పరిస్థితులను చూశారని, ఇది చక్కెర పరిశ్రమను బలోపేతం చేసిందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ20 ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఇంధనం వైపు ప్రజలను మళ్లించే అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు అని, తమ విధానం, రోడ్‌మ్యాప్.. ప్రజలను బయోఫ్యూయల్స్ వైపు మళ్లించడమే అని ఆయన చెప్పారు. ఇంధనం అంశంలో స్వయం సమృద్ధి సాధించాలని, ఆత్మనిర్భర్ భారత్ విజన్ ఇదే అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి వాహనంలో మెకానికల్ సమస్యలు వస్తాయని చెబుతూ వాటిని ఆటోమెటిక్‌గా ఇథనాల్ బ్లెండింగ్‌తో లింక్ చేయవద్దు అని గడ్కరీ కోరారు. వాహనాల్లో సమస్య వస్తే, వాటి ఓనర్లు ముందుగా తనిఖీ చేసుకోవాలని, కానీ ఇంధనం వల్లే ఆ సమస్య వచ్చిందని ఇథనాల్‌కు లింకు చేయరాదని ఆయన సూచించారు.
“భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించకూడదా? ఇంధన స్వయం సమృద్ధి దేశానికి ప్రయోజనకరం కాదా?” అని విమర్శకులను ఆయన ప్రశ్నించారు. 2023కు ముందు తయారైన తమ వాహనం ఇంజిన్ ఈ20 ఇంధనం వల్ల దెబ్బతిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా ఉంటే, వారు లాంఛనంగా ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన సవాలు విసిరారు.
ఇలాంటి కేసులను బీమా కంపెనీలు విచారిస్తాయని, ఆ విచారణ ఫలితాలను ప్రభుత్వం ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. మారుతీ సుజుకీతో సహా ప్రముఖ వాహన తయారీ సంస్థలు, ఈ20 ఇంధన వినియోగం వల్ల ఎటువంటి సమస్యలూ తలెత్తలేదని ధృవీకరించాయని గడ్కరీ పేర్కొన్నారు. పాట్నాలో వాహనం మొరాయించిన ఘటనకు మొదట్లో ఇథనాల్ కలిపిన ఇంధనమే కారణమని భావించినప్పటికీ, విచారణలో ఆ సమస్యకు కారణం కల్తీ పెట్రోల్ అని, ఇథనాల్ కాదని తేలిందని గడ్కరీ తెలిపారు.

More Stories
మానవ హిత ఉపాధి దిశగా కృషి చేయాలి
పీవోకేలో పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత