హసీనాపై న్యాయ పక్రియ అమలు తప్పదు.. బంగ్లాదేశ్ స్పష్టం  

హసీనాపై న్యాయ పక్రియ అమలు తప్పదు.. బంగ్లాదేశ్ స్పష్టం  

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఇటీవల చేసిన ప్రకటనను బంగ్లాదేశ్ స్వాగతించిందని స్థానిక మీడియా నివేదించింది. ఒక సమావేశంలో మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ సమాచార, వ్యూహరచన సలహాదారు జాహెద్ ఉర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించిన హసీనా, న్యాయాన్ని ఎదుర్కోవడానికి స్వదేశానికి తిరిగి రావాలని ఆయన సూచించారు.

 “మేము ఆమె ప్రకటనను స్వాగతిస్తున్నాము, ఎందుకంటే మేము న్యాయం జరగాలని కోరుకుంటున్నాము” అని జాహెద్ ఉర్ రెహమాన్ పేర్కొన్నారు. అయితే, ఆమె చేసిన నేరాలకు విధించిన మరణశిక్షను అమలు చేయాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల కోరిక మేరకు ఆ శిక్ష అమలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.  “ఆమె ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయవాదులను తీసుకురావచ్చు” అని ఆయన సూచించారు. 

ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “నేను ఈ ఏడాది స్వదేశానికి తిరిగి వస్తాను” అని హసీనా ప్రకటించిన కొద్ది రోజులకే బంగ్లాదేశ్ ఉన్నతాధికారి నుండి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.  మరోవంక, షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ కు వస్తే చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం స్పష్టం చేశారు. 

హసీనా ఎక్కడ లొంగిపోయినా, బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన వెంటనే చట్టపరమైన ప్రక్రియ అమలవుతుందని పేర్కొన్నారు. హసీనా లొంగిపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే చర్యలు తీసుకుంటామని షామా ఒబైద్‌ తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పారు.  ఆమె ఇప్పటికే కోర్టులో దోషిగా తేలిన వ్యక్తి, అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశమేమీ లేదని పేర్కొన్నారు. భారత్‌లో లేదా బంగ్లాదేశ్‌లో లొంగిపోయినా ముందుగా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.

హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన తర్వాత చట్టపరమైన ప్రక్రియ ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాన్ని న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. షేక్ హసీనాను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ తాత్కాలిక ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని, ప్రస్తుతం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) నేతృత్వంలోని ప్రభుత్వం కూడా అదే ప్రక్రియను కొనసాగిస్తోందని షామా ఒబైద్ తెలిపారు. 

మరోవైపు షేక్ హసీనా త్వరలో ఢాకాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలపై భారత్ ఆచితూచి స్పందించింది.’షేక్ హసీనా అప్పగింత అంశం పూర్తిగా న్యాయపరమైనది. దీనిపై భారత విధానంలో ఎలాంటి మార్పు లేదు. చట్టప్రకారమే చర్యలు ఉంటాయి.’ అని  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.