తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేరు రెండు వేర్వేరు పార్లమెంటరీ పరిధుల్లోని రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నట్లు అధికారిక ఓటరు నమోదు డేటా ద్వారా స్పష్టమవుతోంది. 1950 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ పౌరుడూ కూడా ఒకటి కంటే ఎక్కువ నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హుడు కాదనే నిబంధన ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
ప్రస్తుత ఓటర్ల జాబితా రికార్డుల ప్రకారం, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటరుగా నమోదై ఉన్నారు. అదే సమయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ నియోజక వర్గం ఓటర్ల జాబితాలో కూడా ఆయన పేరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు చోట్లా ఉన్న ఓటరు నమోదు పత్రాలలో ఆశ్చర్యకరంగా ఒకే ఒక ఎలక్షన్ ఐడీ కార్డ్ నంబర్ (టీఈఎస్0274035) ఉండటం గమనార్హం.
అచ్చంపేట పరిధిలోని వాంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని ఆయన నివాస గృహ నంబర్ 3-48 అడ్రస్‌తో ఒక ఓటు ఉంటే, కొడంగల్ పరిధిలో హౌస్ నంబర్ 1-209 అడ్రస్‌తో రెండో ఓటు నమోదై ఉంది. ఈ డబుల్ ఎంట్రీ రికార్డులలో ముఖ్యమంత్రి పేరు స్పెల్లింగ్‌లో కూడా తప్పులు దొర్లాయి. ఆయన పేరు అసలు స్పెల్లింగ్ “Revanth” (రేవంత్) కాగా, రెండు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలోనూ నరసింహా రెడ్డి కుమారుడైన “Anumula Revant Reddy” (అనుముల రేవంత్ రెడ్డి) అని నమోదై ఉంది.
అయితే ఈ స్పెల్లింగ్ తప్పులను సరిదిద్దుకోవడానికి నిబంధనల ప్రకారం సంబంధిత ఓటర్ రిజిస్ట్రేషన్ అధికారికి ఫామ్-8 సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఈ డబుల్ ఓటు నమోదును తొలగించుకోవడానికి తాము సాధారణంగా నివసించని నియోజకవర్గ పరిధిలోని అధికారికి స్వచ్ఛందంగా ఫామ్-7 సమర్పించి, ఒక ఓటును రద్దు చేయాలని కోరే అవకాశం ఉంది. దేశంలో బహుళ ఓట్ల నమోదు అంశంపై చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది.
రెండు చోట్ల ఒకే వ్యక్తికి ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదని ఇటీవలే ఈసీ ప్రకటించింది. గత కొన్ని రోజుల క్రితమే ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి బహుళ రాష్ట్రాల్లో ఓటరుగా నమోదయ్యారనే ఆరోపణలపై బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయిల్ పొంది చట్టపరమైన విచారణను ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటరు నమోదు డేటాలోనూ ఇలాంటి డబుల్ ఎంట్రీలు బయటపడటంతో ఆయనకు కూడా ఏడిది కాలం జైలు శిక్ష పడే అవకాశం ఏమైనా ఉందా? అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు.
కాగా, ఒకే ఎపిక్ నంబర్‌తో రెండు చోట్ల ఓటు నమోదై కనిపించడం అంటే తప్పనిసరిగా రెండు చెల్లుబాటు అయ్యే ఓట్లు ఉన్నాయనే అర్థం కాదని అధికారులు చెబుతున్నారు. ఓటరు జాబితాల సవరణలు, పేరు మార్పులు, నియోజకవర్గ మార్పు ప్రక్రియల సమయంలో తాత్కాలికంగా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అదే దీనిపై ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సీఎం కార్యాలయం కూడా దీనిపై స్పందించలేదు.

More Stories
తెలంగాణాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో 88 లక్షల ఓట్లు గల్లంతు!
నేపథ్య గాయని జానకి `పద్మ భూషణ్’ ఎందుకు తిరస్కరించారు?
సీఎం ఒమర్ అబ్దుల్లాకు బిజెపి రూ. 100 కోట్ల పరువునష్టం నోటీస్